17 April, 2026 | 2:02 AM

గాడితప్పిన పాలన

17-04-2026 12:00 AM

ఎల్లంపేట్ మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 16(విజయక్రాంతి):మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  ఎల్లంపేట్ మున్సిపాలిటీలో  పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాల విషయమై ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారుల ఉదాసీనత వ్యవహరిస్తున్న తీరు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.ముఖ్యంగా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న అరుణా గోదాం వ్యవహారంలో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా, కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతిరోజూ దిన పత్రికల్లో కథనాలు వస్తున్నా సామాజిక మాధ్యమాల్లో ప్రజలు మొత్తుకుంటున్నా మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత అధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారుల అండదండలు లేనిదే ఇంత బహిరంగంగా నిబంధనలను ఉల్లంఘించి అరుణా గోదాం విషయంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని అరుణ గోదాం నిర్మాణంలో గానీ దాని నిర్వహణలో  కనీస నిబంధనలు పాటించడం లేదని స్థానికులు అంటున్నారు.మున్సిపల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న గోదాం వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చూస్తుంటే వారు పరోక్షంగా ఆయా సంస్థలకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మేడ్చల్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని స్థానిక యంత్రాంగం వైఫల్యం చెందిన నేపథ్యంలో వెంటనే స్పందించాలని ఎల్లంపేట్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.మున్సిపల్ పట్టణంలోనిఅరుణ గోదాం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా పాలనపై ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సమాజంలో మామూలు వ్యక్తి పర్మిషన్ లేకుండా చిన్న ఇల్లు కడితేనే మున్సిపల్ అధికారులు కూల్చి వేయడానికి ముందుకు వస్తారు కానీ ఇలాంటి అక్రమ గోదాం నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.