2 May, 2026 | 10:39 PM

సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ

02-05-2026 09:13 PM

* అంబేద్కర్ నగర్, బీసీ కాలనీల పునరావాసాలకు ఏర్పాట్లు

*  పునరావాసానికి తగిన స్థలాలను పరిశీలించాలని  ఎమ్మెల్యే సూచన

* శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్, జిల్లా నూతన కలెక్టర్ దివాకర్ లకు కాలనీవాసుల సన్మానం

సత్తుపల్లి,(విజయక్రాంతి)సింగరేణి బొగ్గు రవాణాకు గత ప్రభుత్వం జనావాసాలకు అతి దగ్గరగా ఏర్పాటు చేసిన శైలో బంకర్ ను తమ ప్రాంతం నుండి తొలగించాలని కిష్టారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీవాసులు సుమారు 40 రోజులు చేపట్టిన ఆందోళనను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిశీలించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ చొరవతో రెండు కాలనీల పునరావాసానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

కాలనీల పునరావాసానికి అనువైన స్థలాలను పరిశీలించి ఎంపిక చేసుకోవాలని కాలనీ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సూచించారు. ఈ మేరకు సత్తుపల్లి ఎం.ఆర్ గార్డెన్స్ లో శనివారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ను, బదిలీపై నూతనంగా విధులు చేపట్టిన ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ను కాలనీవాసులు గ్రామ సర్పంచ్ నరుకుళ్ళ రాజేశ్వరి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు నరుకుళ్ళ అప్పారావు తో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ సింగరేణి శైలో బంకర్ కాలుష్యంతో మారణ హోమంగా మారిన అంబేద్కర్ నగర్ బీసీ కాలనీల దుస్థితిని పరిశీలించి కాలనీ ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టిన ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.