18 April, 2026 | 8:59 PM

అంతుచిక్కని ఓటరు నాడీ

28-02-2025 02:07 AM

కరీంనగర్, ఫిబ్రవవరి 27 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల నాడి అంతుచిక్కకుండా ఉంది. ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు తాము ఎవరికి ఓటు వేశామన్న అభిప్రాయాన్ని బహిర్గతం చేయలేదు. సైలెంట్ ఓటింగ్ కనిపించింది. హుస్నాబాద్లో కాంగ్రెస్ వారు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగిన సంఘటన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పోలింగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు హాట్సాప్ చెప్పారు. కాంగ్రెస్ దాడులకు భయపడకుండా పోరాడిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా విజయం బీజేపీదేనని, కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నారు. కరీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత  ఓటుతోనే తాను గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తన గెలుపు కోసం కష్టపడ్డారని, పట్టభద్రులు తనకు అనకూల తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ కార్డు పనిచేసిందని, సైలెంట్ ఓటు తనకు అనుకూలంగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రస్మా నాయకుడు, స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు, ఏఐఎఫ్ బి అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, మరో స్వతంత్ర అభ్యర్తి ముస్తాక్ అలీలు సైతం ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంలో తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాన ప్రత్యర్థులు ఉదయం నుండి పోలింగ్ ముగిసే వరకు పోలింగ్ బూత్ లను సందర్శించి ఓటింగ్ సరళిని గమనిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, అభ్యర్థులు, రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు తమ తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదిలా ఉండగా పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధానంగా పోటీపడ్డ అభ్యర్థులు తమకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా బ్యాలెట్ పేపర్ లో ప్రాధాన్యత ఓట్లు వేసే క్రమంలో చాలామంది బాణం ఆకారం ఒకటి కాకుండా ఒకటి గీత పెట్టడంతో ఆ ఓట్లు చెల్లే అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.