11 August, 2026 | 1:18 AM

బహుజన నాయకుడు సర్వాయి పాపన్న

11-08-2026 12:29 AM
  1. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  2. రవీంద్ర భారతిలో జయంతి

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైదరాబాద్ రవీంద్ర భారతిలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై, పాపన్న చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. సర్వాయి పాపన్న ఆసియా ఖండంలోనే మొదటి చక్రవర్తి, బహుజన నాయకుడు అన్నారు. ‘మాజీ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని జీఓ ఇప్పించాం.

ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి, రూ.3 కోట్లను కేటాయించాం’ అని తెలిపారు. గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపాలి, రాష్ట్రంలో మూసిన కల్లు దుకాణాలను తెరవాలి,  భువనగిరి జిల్లా నందనంలో నీరా కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చెట్టు పైనుంచి పడి మరణించిన గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉత్తరప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లు, మహారాష్ట్ర నాయకులు నంద కిషోర్, కర్ణాటక సీఎంవో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, గుల్బ ర్గా- కర్ణాటక యువ నాయకులు రాజేష్ గుత్తేదార్, ఏపీటీటీపీఎఫ్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు శైలజగౌడ్, తదితరులు పాల్గొన్నారు.