గుప్త నిధుల పేరుతో రూ.కోటి మోసం
నలుగురు సభ్యుల ముఠా అరెస్టు..
నకిలీ బంగారు నాణేలు, బొగ్గు స్వాధీనం
రాజేంద్రనగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): గుప్త నిధుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ముఠాకు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా, సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మ హ్మద్ సల్మాన్లను అరెస్టు చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి.. బాధితులతో గుంతలు తీయించి, అందులో ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేల సంచులను ఉంచేవారు.
పూజలు చేసిన అనంతరం బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందని చె ప్పి అక్కడి నుంచి జారుకునేవారు. ఇలా వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేలు, 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మునావ్ప గతంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.






