మైసిగండిలో ఘనంగా ‘తీజ్’ వేడుకలు
కడ్తల్, అగస్టు 25(విజయక్రాంతి): కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో ‘తీజ్’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ నేత బాలాజీ సింగ్ పాల్గొనగా, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ... తీజ్ వేడుకలు ప్రకృతిని ఆరాధించే విశిష్టమైన పండుగని అన్నారు. గిరిజనులు అత్యంత సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను, మూలాలను కాపాడతాయని ఆయన పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలు, యువతులు ధాన్యపు మొలకల బుట్టలను నెత్తిపై ధరించి ఊరేగింపుగా తరలివచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో వారు చేసిన జానపద నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆ మొలకల బుట్టలను స్థానిక చెరువులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగిశాయి.






