calender_icon.png 8 June, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెండ్ సృష్టిస్తున్న బామ్మలు

08-06-2025 12:00:00 AM

మీకు 70 ఏళ్లా? మీ జీవన విధానం ఎలా ఉంటుంది? ఉదయం లేవడం, కాఫీ తాగడం, వాకింగ్‌కి వెళ్లడం, పేపర్ చదవడం, భోంచేయడం, టీవీ చూడటం అంతేనా?.. అయితే చైనా బామ్మలు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..

దౌబన్ లైవ్ స్టీమింగ్‌లో ఉత్పత్తులను అమ్ముతోంది ఓ యాంకర్. ఆమె ఎంతో చాకచక్యంగా మాట్లాడుతూ నిమిషంలో 200 ఉత్పత్తులను అమ్మేసింది. ఆమె వయసు 78 ఏళ్లు. ఆవిడకు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 

* ‘కంట్రీసైడ్ ప్లంగ్ దహాయి’ పేరుతో ఉన్న వీడియోలు చైనా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టకుని, పళ్లన్నీ ఊడిపోయి మురిపెంగా కనిపించే తాతగారి వయసు 83 ఏళ్లు. ఆయనకు పదహారు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

* చెంగ్లుకి చెందిన 99 ఏళ్ల బామ్మ ఆన్‌లైన్‌లో పెద్ద సెలబ్రిటీ. హాట్ పాట్ నుంచి హోమ్ బర్లర్స్ వరకూ అన్ని రుచులను ఆస్వాదిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈవిడకు ఆరున్నర లక్షల మంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ముద్దుగా ఫుడ్ ఆఫిసియానొడో గ్రానీ అని పిలుస్తారు. 

* సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తున్నారు పెద్దలు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా. అందులో 18 శాతం మంది వయసుపైబడిన వాళ్లే. కొంతమంది సొంతంగా వీడియోలు తీసి పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్లకి దౌబన్, క్వాయిబౌ లాంటి షార్ట్ వీడియో యాప్స్ బాగా కలిసి వచ్చాయి. వీటికి నెలకి ఎనభై కోట్ల మంది ఆక్టివ్ యూజర్స్ ఉన్నారట. తాతయ్యలు, అమ్మమ్మలు చేసిన వీడియోలకు లైక్స్ బాగా వస్తున్నాయి కూడా. 

జీవిత చరమాంకంలో ఉన్న ఈ కురువృద్ధులు కేవలం వ్యాపార ధోరణితో కాకుండా తమ వీడియోల్లో సమాజానికి ఉపయోగపడే సందేశాలు కూడా ఇస్తున్నారు. అందం కేవలం యువత సొంతం కాదు. వయసు పైబడిన వాళ్లు కూడా అద్భుతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. వంటి సందేశాలతో పాటు గృహహింసను అరికట్టడం లాంటి అంశాల మీద కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు.

ఓ షార్ట్ వీడియోలో తన భార్య మీద చేయి ఎత్తుతాడు భర్త.. అతడి చేతిని పట్టుకుని ఓ ముసలావిడ సెక్యురిటీ గార్డులను పిలుస్తుంది. గృహ హింస నేరం అంతే కాదు మహిళలపై చేయి చేసుకోవడం అనైతికం అనే అక్షరాలు తెరమీద కనిపిస్తాయి. మరో వీడియోలో గర్భవతి అయిన భార్యతో గొడవ పడుతుంటాడు భర్త. అక్కడ ఓ పెద్దావిడ ప్రత్యక్షమై అతడిని కుర్చీలోకి తోసి బాధలో ఉన్న మహిళను కౌగిలించుకుంటుంది. 

చైనాలో ప్రస్తుతం రిటైరవుతున్న వాళ్లందరూ 1960లలో పెట్టినవాళ్లు. వీళ్లు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదించడానికి వీరికి టెక్నాలజీ బాగా ఉపయోగపడుతున్నది. అందుకే ఇంటర్నెట్ ఇండస్ట్రీలో నాణ్యతను పెంచడానికి అక్కడ కొన్ని సంస్థలూ ఏర్పడ్డాయి. వీళ్ల సోషల్ అకౌంట్స్ చూడటంతో పాటు వారికి లాభసాటిగా నడిచేలా చేస్తున్నాయి. ఇదో పెద్ద వ్యాపారంగా మారుతోంది.

వృద్ధాప్యం అంటే అనారోగ్యం, ఇంకా ఏం చేయలేం అనే అభిప్రాయాలను ఈ సోషల్ మీడియా వృద్ధ యాంకర్లు క్రమంగా తొలగిస్తున్నారు. యువతీయువకులు ఈ ఎవర్‌గ్రీన్ జనరేషన్ వీడియోలను చూసి వృద్ధాప్యం గురించి ఆలోచించడం, భయపడటం మానేశారు. వీరందరికీ వయసు ఒక సంఖ్య మాత్రమే. ఇప్పుడే అసలైన జీవితం అంటున్న పెద్దల ఆనందానికి అవదుల్లేవు కాదు.