23 March, 2026 | 3:52 PM

Breaking News

ఇది 1975 నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!.. రాంచందర్ రావు అరెస్ట్   •   భట్టి మాటలకు అర్థాలే వేరులే   •   ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక   •   శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్‌గా అడ్డగుంట రాజేందర్   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అమరవీరుల దినోత్సవం   •   ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •  

నల్లగా ఉంటే తప్పా?

08-06-2025 12:00 AM

అవును నాది డార్క్ స్కిన్. నల్లగా ఉండే వాళ్లు నటించలేరా? ప్రతిభను రంగుని బట్టి నిర్ణయిస్తారా? రంగుకి, ప్రతిభకు సంబంధం లేదు. సినిమా పరిశ్రమలో నేను అడుగు పెట్టగానే నా రంగు, రూపం, శరీరాకృతికి సంబంధించి బాధపెట్టె వ్యాఖ్యలెన్నో వినిపించాయి. అయినా వెనుకడుగు వేయలేదు. సినిమాలకు పనికిరానని ఎగతాళి చేసిన చోటే హీరోయిన్‌గా నిలబడ్డాను.‘మన జీవితాలని మార్చడానికి సూపర్ హీరోలు రారు.

మనమే మార్చుకోవాలి. ఎంత బలంగా నేలని తాకామో, అంతకు రెట్టింపు బలంతో లేచి నిలబడాలి. ఏ అండాలేని ఆడపిల్లలు ఆత్మస్థుర్యైన్నే ఆసరాగా చేసుకుని ఎదగాలి. ఇందుకు నా జీవితమే ఉదాహరణ’ అంటున్నారు ప్రముఖ నటి ఐశ్వర్యా రాజేష్

పదహారేళ్లకు ఒక పక్క చదువు, మరో పక్క ఉద్యోగ వెతుకులాట. షాపు ముందు నిల్చుని చాకోలెట్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశా. రోజుకు రూ.225 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. తక్కువే కావచ్చు. కానీ నేను సంపాదించగలననే ధైర్యానిచ్చింది. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే.. జీవితం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కుంగిపోవద్దు.

జీవితాన్ని మార్చే దారులు వెతుక్కోండి. మీ జీవితాన్ని మార్చడానికి, ఇబ్బందులు తొలగించడానికి సూపర్ మ్యాన్‌లు రారు. మనల్ని మనమే రక్షించుకోవాలి. వేరే వాళ్ల మీద ఆధారపడటం మానేయాలి. సొంతంగా ఎదగడంలోని ఆనందం కోట్లు ఇచ్చినా కొనలేం. మీ దారిపొడవునా నిందించే వాళ్లు, వెక్కిరించేవాళ్లు, వెనక్కి లాగే వాళ్లు ఎంతోమంది ఎదురవ్వొచ్చు. వారిని లెక్కచేయకుండా ముందుకు సాగాలి. 

మా అమ్మే స్ఫూర్తి..

ఇప్పుడు నేను మీ అందరికీ హీరోయిన్‌గా పరిచయం. కానీ అంతకుముందు నేనెవరు? అందరిలాంటి సాధారణ అమ్మాయిని. ఇంటి బాధ్యతలు మోస్తున్న అమ్మకి నా భుజాన్ని సాయంగా ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న సగటు ఆడపిల్లని. ఎనిమిదేళ్లకే నాన్న మరణం. ఆ తర్వాత అన్నయ్య, తమ్ముడు చనిపోవడం కళ్లారా చూసి తట్టుకుని నిలబడ్డాను. అయిదుగురితో కళకళలాడే మా ఇల్లు.

నాకు పదహారేళ్లు వచ్చేసరికి ఇద్దరితో బోసిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అమ్మ చీరలమ్మడం ప్రారంభించింది. అలాంటి రోజుల్లో నేను తలరాతను నిందించలేదు. ముందుకే అడుగేశాను. కష్టాన్ని చూసి భయపడలేదు, దాన్ని ఎలా దాటాలా అని ఆలోచించాను.

అందుకు మా అమ్మే నాకు స్ఫూర్తిగా నిలిచింది. అంతవరకు ఇల్లు దాటని అమ్మ, ముంబై వెళ్లి భాష రాకపోయినా అక్కడ్నుంచి చీరలు తెచ్చి చెన్నైలో అమ్మేది. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కూడా పనిచేసేది. ఇప్పటికీ ఆమెలో అదే స్ఫూర్తి కనిపిస్తుంది. నా సహనటులు ఇంటికొస్తే పాలసీలు తీసుకోమని అడుగుతుంది. 

ఆత్మవిశ్వాసం అవసరం

మన మీద మనకే నమ్మకం లేకపోతే ప్రపంచం ఎందుకు నమ్ముతుంది? అందుకే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి. నా రెండో సినిమానే ఇద్దరు పిల్లల తల్లిగా చేసేందుకు ఒప్పుకున్నా. అప్పుడందరూ నవ్వారు. డీ గ్లామర్ పాత్ర, అందులోనూ తల్లి పాత్రలో నేను ఒదిగిపోగలననే నమ్మకం నాది.

ఆ పాత్ర చేశాను. నటన పరంగా చాలామంచి పేరు వచ్చింది. ఐశ్వర్య చక్కగా నటిస్తుందని అందరికీ అర్థమైంది. కాకపోతే ఆ సినిమా తర్వాత నేను ఊహించుకున్నట్లు మంచి ఛాన్సులు రాలేదు. అయినా నేను కుంగిపోలేదు, ప్రయత్నాలు ఆపలేదు. 

మనకు మనమే హీరోలం

ఇద్దరు పిల్లల తల్లిగా చేశాక సినిమా అవకాశాలు ఆగిపోయాయి. మంచి నటి అని మెచ్చుకున్నారు కానీ, పెద్ద హీరోల పక్కన ఛాన్సులు ఇవ్వలేదు. అప్పుడనిపించింది నేనే హీరోగా మారితే అని. అలా విమెన్ ఓరియంటెడ్ సినిమా ‘కణా’ చేయడానికి ఒప్పుకున్నా. ఆ సినిమా నా జీవితాన్నే మార్చింది. అది తెలుగులో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ గా విడుదలైంది. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు.

మంచి సినిమాలు, పెద్ద కోస్టార్లతో అవకాశాలు తలుపుతట్టాయి. మీరు చేసిన పనివల్ల పరాజయం ఎదురైతే నిరాశ చెందకండి. ఆ పరాజయం నుంచి ఏం నేర్చుకోవచ్చో వెతకండి.  కేవలం తమిళంలోనే కాదు, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాను.