26-11-2025 12:26:04 AM
న్యూఢిల్లీ, నవంబర్ 25: ఇథియోపియాలో హేలీగుబ్బి షీల్డ్ అగ్నిపర్వతం సోమవారం విస్ఫోటనం చెంది గాలిలోకి పెద్ద ఎత్తున బూడిద వెలువడింది. అది కాస్త పెద్ద మేఘంలా ఆకాశాన్ని దట్టంగా పట్టేసి మంగళవారం మధ్యాహ్నానికి గుమ్మటంలా తూర్పు వైపు కదులుతూ భారత్‌లోకి ప్రవేశించింది. ఆ ప్రభావం గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీపై కనిపించింది.
దీంతో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుందని భారత వాతావరణశాఖ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అంచనా వేసింది. అయితే.. అనూహ్యంగా బూడిద మేఘం సాయంత్రానికి చైనా వైపు గమనాన్ని మార్చుకున్నది. రాత్రికి భారత గగనతలం నుంచి వెళ్లిపోయింది. దీంతో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని, విమాన సర్వీసులన్నీ సజావుగా సాగాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.