13 March, 2026 | 5:09 PM

మునుగోడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

13-03-2026 04:33 PM

- ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోట్ల రూపాయల రోడ్లు, భవనాలు ప్రారంభం

- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నేలికంటి సత్యం కలిసి  పాల్గొన్నారు. మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో రూ.1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుంచి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కల్వకుంట్ల గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో కల్వకుంట్ల నుంచి చండూరు మండలం కొండాపురం వరకు వయా వెంకటేశ్వర్ నగర్ మార్గంలో నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు.మునుగోడు పట్టణంలో కూడా పలు రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మునుగోడు–చండూరు ఆర్ అండ్ బి రోడ్డు నుంచి దుబ్బ కాల్వ రోడ్డు వరకు రూ.85 లక్షల వ్యయంతో, అలాగే కేజీబీవీ పాఠశాల ఎదురుగా లక్ష్మీదేవిగూడెం వరకు రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

మునుగోడు–చండూరు ఆర్ అండ్ బి రోడ్డు నుంచి సోలిపురం వరకు రూ.3 కోట్ల 85 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దుబ్బాకాలువ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి ప్రారంభించారు. మునుగోడు కిష్టాపురం రోడ్డు నుంచి వెలగలగూడెం గ్రామం వరకు రూ.4 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు తెలిపారు.