13 March, 2026 | 5:08 PM

యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి

13-03-2026 04:36 PM

- బడ్జెట్ సమావేశాల్లో యువత సమస్యలపై గళం విప్పాలి

- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి డివైఎఫ్ఐ వినతి పత్రం

మునుగోడు,(విజయక్రాంతి): రాష్ట్ర శాసనసభలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, నిరుద్యోగ యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి కోరారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కల్వకుంట్ల గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు నేలికంటి సత్యంకి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు యువజన రంగానికి నిధులు కేటాయించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. యూత్ డిక్లరేషన్ హామీని అమలు చేసి నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే కల్వకుంట్ల గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి అందజేశారు.

ముఖ్యంగా గ్రామానికి బస్సు సౌకర్యం, పక్క గ్రామాలకు లింకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, నూతన అంగన్వాడి భవనం, గ్రామపంచాయతీ కార్యాలయం, వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి చేయూతనివ్వాలని కోరారు. గ్రామాల్లో యువతకు ఉపాధి లేకపోవడంతో చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై శాసనసభ, శాసనమండలిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గళం విప్పి మాట్లాడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న యువత వ్యతిరేక విధానాలను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నరేష్, మండల నాయకులు కట్ట ఆంజనేయులు, బొల్ల నవీన్, బొందు శివ, కుక్కల మహేష్, బయ్య సురేష్ తదితరులు ఉన్నారు.