23 August, 2026 | 12:42 PM

ప్రెస్ క్లబ్ నూతన భవనానికి ఘనంగా భూమిపూజ

23-08-2026 11:33 AM

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో నిర్మాణానికి అంకురార్పణ

ఆలేరు, ఆగస్టు 23(విజయక్రాంతి): ఆలేరు జర్నలిస్టుల చిరకాల ఆకాంక్ష అయిన ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి శనివారం అంకురార్పణ జరిగింది. ఆలేరు పట్టణంలోని 1026 ప్రభుత్వ భూమిలో ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా భూమిపూజ చేశారు. జర్నలిస్టుల సమావేశాలు, ప్రెస్‌మీట్లు, మీడియా సమావేశాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనువుగా అన్ని సౌకర్యాలతో నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించనున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిద్ పాషా, కార్యదర్శి జంపాల దశరథ తెలిపారు.

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే ఆలేరు జర్నలిస్టులకు శాశ్వత వేదికగా నిలవడంతో పాటు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కొరుటూరు ఉపేందర్, కుళ్ల సిద్ధులు, గుండు మహేందర్, కోశాధికారి ముళ్లకల రవి, కార్యదర్శి చింతకింది వెంకటేష్, పోతుగంటి సంపత్, గౌరవ సలహాదారులు మంచన మల్లేశం, సందెన శంకర్, సభ్యులు శనిగరం శ్రీనివాస్, ఎండీ జహంగీర్, కోల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.