23 August, 2026 | 1:35 PM

వరంగల్‌లో కానిస్టేబుళ్ల వీరంగం

23-08-2026 12:35 PM

వరంగల్ ఆగస్టు23(విజయక్రాంతి): వరంగల్ పోలీసుల మధ్యే ఘర్షణ చోటుచేసుకున్న ఘటన వరంగల్‌లో కలకలం రేపింది. మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ బార్ వద్ద న్యూసెన్స్ చేయడంతో సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లగా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి చివరకు ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన హంటర్ రోడ్డులోని ఉర్సుగుట్ట సమీపంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం..ఉర్సుగుట్ట సమీపంలోని ఓ బార్‌లో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మద్యం సేవించి న్యూసెన్స్ చేశాడు. దీంతో బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. 

అక్కడ మద్యం మత్తులో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సంతోష్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ జరిగింది. ఈ బాగోతం చూసిన అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులే పరస్పరం ఘర్షణకు దిగడం స్థానికంగా చర్చకు దారితీస్తుంది. ఘటనపై బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.