జీఎస్‌ఎల్వీఎఫ్17 విజయవంతం
సురక్షితంగా నింగిలోకి
18 నిమిషాల్లోనే నిర్ణీత కక్ష్యలో జీశాట్
36వేల కి.మీ. నుంచి భారత ఉపఖండం చిత్రాలు
మరోసారి చరిత్ర సృష్టించిన ఇస్రో
తొలిమెట్టులో విఫలం.. రెండో ప్రయత్నంలో సక్సెస్
భారత్ సామర్థ్యానికి మరో నిదర్శనం: ప్రధాని మోదీ
త్వరలో గగన్‌యాన్ తొలి ప్రయోగం: ఇస్రో చైర్మన్ నారాయణన్
అమరావతి, సెప్టెంబర్ 4: దేశంలోనే మొట్టమొదటి జియో- ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో(ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్వీఎఫ్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఉపయోగించి 2,300 కిలోలకు పైగా బరువున్న పేలోడ్‌ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టి తన సత్తాను ప్రపంచానికి చాటింది.
తొలిమెట్టులో విఫలమైనా రెండో ప్రయత్నంలో సక్సెస్ సాధించింది. ఈ ఈవోఎస్ (జీశాట్ ఉపగ్రహం మిషన్‌లో పాల్గొన్న ఒక సీనియర్ శాస్త్రవేత్త ‘ఇది ఆకాశంలో నిఘానేత్రం’ అని అభివర్ణించారు. నిజ -సమయ చిత్రాలను అందించడమే కాకుండా వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి వెన్నుదన్నుగా నిలవనుంది. శుక్రవారం నాటి ఈ ప్రయోగం, అంతరిక్ష సంస్థకు 2026 సంవత్సరంలో మొదటి విజయాన్ని అందించింది. భారత్ సామర్థ్యానికి మరో నిదర్శనమని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో గగన్‌యాన్ తొలి ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్వీఎఫ్ రాకెట్.. నింగికెగిసిన సుమారు 18 నిమిషాల తర్వాత, ఈఓఎస్-05 ఉపగ్రహం నిర్దేశిత ‘సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్’లో విజయవంతంగా ప్రవేశపెట్టబడిందని ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్-05 ఒక ‘గూఢచారి ఉపగ్రహం’ అనే ఊహాగానాలను అంతరిక్ష సంస్థ తోసిపుచ్చింది. అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్‌ఈఓ) నుంచి పనిచేస్తుండగా, ఈఓఎస్-5 ఉపగ్రహం భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో (జియో సింక్రోనస్ కక్ష్యలో) ఉంటుంది.
ఈ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానంగా కదులుతుంది. అంతేకాదు ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి భారత ఉపఖండాన్ని చిత్రించే సామర్థ్యం ఉంది. ఇందులో హై రిజల్యూషన్‌తో కూడిన కెమెరాలను ఏర్పాటు చేశారు. 2,300 కిలోలకు పైగా బరువున్న ఈ ఉపగ్రహం జీఎస్‌ఎల్‌వీ ద్వారా మోసుకెళ్లిన అత్యంత భారీ ఉపగ్రహం కావడం విశేషం. అలాగే ఇది తన నిర్దేశిత పథంలో కచ్చితంగా ముందుకు సాగింది. గతంలో ఎదురైన కొన్ని వైఫల్యాల తర్వాత వచ్చిన ఈ మిషన్ విజయం, సంస్థలో నైతిక స్థైర్యాన్ని పెంచింది.
ఈ విజయంపై ఇస్రో చీఫ్ వీ నారాయణన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది శ్రీహరికోట నుంచి 107వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ 19వ మిషన్’ అని ప్రయోగం జరిగిన వెంటనే అంతరిక్ష శాఖ కార్యదర్శి (మిషన్‌లో పాల్గొన్న కీలక శాస్త్రవేత్తలతో కలిసి) పేర్కొన్నారు. జీఎస్‌ఎల్‌వీ (డీ1) మొదటి ప్రయోగం 1,536 కిలోల పేలోడ్‌తో జరిగిందని, అప్పటి నుంచి నిర్మాణాత్మక బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా ఇస్రో క్రమంగా జీఎస్‌ఎల్‌వీ పనితీరును మెరుగుపరిచిందని ఆయన గుర్తుచేశారు.
అంతకుముందు, బుధవారం రాత్రి 23:30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి తెల్లవారుజామున 2:55 గంటలకు రాకెట్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అర్ధరాత్రి వేళ, వర్షం ఉన్నప్పటికీ ప్రజల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రయోగాన్ని వీక్షించి ఉత్సాహపరిచేందుకు గొడుగులతో 1,500మంది వరకు లాంచ్ వ్యూ గ్యాలరీకి వచ్చారు.
51.7 మీటర్ల ఎత్తు, మూడు దశలు కలిగిన ‘జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్’ (జీఎస్‌ఎల్‌వీ) - దీని మూడో దశ క్రయోజెనిక్ సాంకేతికతతో కూడుకున్నది.- 420.5 టన్నుల బరువుతో నింగిలోకి దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని రాకెట్ అగ్రభాగంలో (నోస్ కోన్) భారీ ఉపగ్రహం అమర్చబడింది. జీఎస్‌ఎల్‌వీఎఫ్17/ఈఓఎస్-05 మిషన్‌ను 2021లో విఫలమైన జీఎస్‌ఎల్‌వీఎఫ్-10/ఈఓఎస్-03 మిషన్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టబడింది. దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయోగం, ఈ సంవత్సరంలో ఇస్రోకు తొలి విజయాన్ని అందించింది.
మరో ఆరు ప్రయోగాలకు సిద్ధం: ఇస్రో చైర్మన్ నారాయణన్
జీఎస్‌ఎల్వీఎఫ్ విజయం పట్ల ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఓఎస్ పనికాలం తొమ్మిది సంవత్సరాలని పేర్కొన్నారు. అలాగే ఇది ‘గూఢచారి ఉపగ్రహం’ అనే ఊహాగానాలను కొట్టిపారేశారు. మానవరహిత గగన్‌యాన్ మిషన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే తొలి ప్రయోగం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ విజయం భారత సాంకేతిక నైపుణ్యం, శాస్త్రవేత్తల కృషికి ప్రతీకగా అభివర్ణించారు. ప్రయోగం విజయం పట్ల షార్ ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
దేశానికి గర్వకారణం: ప్రధాని
ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ దేశానికి గర్వకారణంగా ఎక్స్‌లో ఈ ప్రయోగాన్ని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి ఇది మరో నిదర్శనమని ప్రశంసలు కురిపించారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు, ఈ రంగంలో మన సమర్థతను మరింత బలోపేతం చేస్తోందన్నారు.






