గూడెందొడ్డి ప్రాజెక్టు అంచనాలకు నిచ్చెన!
- బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపు
- అదనంగా 1100 ఎకరాల భూసేకరణకు అనుమతులు
- పరిహారం కింద రూ.165 కోట్ల మంజూరు
- పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా మార్పు.. అధ్యయనానికి రూ.15 కోట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల్ జిల్లా(Jogulamba Gadwal District) ధారూర్ మండలంలోని గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(Gudendoddi Balancing Reservoir)ను బహుళ ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం 1.19 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించడంతో పాటు అదనంగా 1100 ఎకరాల భూసేకరణ కోసం రూ. 165 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం (నీటి పారుదల శాఖ(Irrigation Department)) ఉత్తర్వులు జారీచేసింది.
పంప్డ్‌స్టోరేజ్ ప్రాజెక్టుగా మార్పు..
జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పరిధిలోని గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పంప్డ్‌స్టోరేజ్ ప్రాజెక్టుగా మార్చడం ద్వారా భారీగా జల విద్యుత్తును ఉత్పత్తి చేయడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో అటు సాగు, తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగించేలా ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిని సౌర విద్యుత్తుతో అనుసంధానించడం గమనార్హం. ప్రస్తుతం గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 1.19 టీఎంసీలు మాత్రమే.
దీనిని 15 టీఎంసీలకు పెంచితే.. భారీగా జల విద్యుత్తును (పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు) ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుంది. దీనితో రెండు, మూడు రకాల ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం ఆలోచన. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా మార్చితే.. రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు ఇతోధికంగా ఉపయోగించేలా ఇక్కడ జల విద్యుత్తు ఉత్పత్తికూడా చేయవచ్చు.
పైగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్వహించడానికి సౌర విద్యుత్తుతో అనుసంధానం వల్ల తక్కువ ధరకే జల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ప్రస్తుతం 1.19 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 15 టీఎంసీల సామర్థ్యానికి పెంచాలంటే అదనంగా 1100 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ. 165 కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనాలు వేసింది.