గుజరాత్ x చెన్నై

10-05-2024 02:22:20 AM

అహ్మదాబాద్: ప్లేఆఫ్ ఆశలు అడుగంటిన వేళ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ కంటే చెన్నైకు కీలకంగా మారింది. చెన్నై ఆడిన 11 మ్యాచ్‌ల్లో ౬ విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్‌పై విజయంతో మూడో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. మరోవైపు గుజరాత్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటికే ముంబై ఎలిమినేట్ కాగా చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ ఓడితే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన రెండో జట్టుగా నిలవనుంది.

గుజరాత్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న చెన్నై మ్యాచ్‌లో ఫెవరెట్‌గా బరిలోకి దిగనుంది. చెన్నై బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ టాప్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మిషెల్, దూబేలతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతుండగా.. ఫినిషర్‌గా ధోనీ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. పతీరణ, ముస్తాఫిజుర్‌లు దూరమైనప్పటికి జడేజా, శాంట్నర్, తుషార్, సిమర్‌జీత్‌లతో బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది. గుజరాత్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎవ్వరు చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేరు. కెప్టెన్ గిల్, సాహా, మిల్లర్‌లు దారుణంగా విఫలమవుతున్నారు. మిడిలార్డర్‌లో షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌లు పర్వాలేదనిపిస్తున్నారు. మోహిత్, లిటిల్, రషీద్ లతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే.