బజరంగ్‌పై నిషేధం

10-05-2024 02:20:19 AM

ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయం

పారిస్ ఒలింపిక్స్‌కు దూరం!

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం విధించింది. 2024 చివరి వరకు అతడు ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదని యూడబ్ల్యూడబ్ల్యూ తేల్చి చెప్పింది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్న బజరంగ్ కల చెదిరింది. కాగా గత వారమే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) బజరంగ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. డోప్ టెస్టు కోసం రక్త, మూత్ర నమునాలు ఇచ్చేందుకు పూనియా అంగీకరించకపోవడంతో నాడా అతడిపై తాత్కాలిక వేటు వేసింది. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య సైతం ఈ ఒలింపిక్ మెడలిస్ట్‌ను సస్పెండ్ చేయడం సంచలనం రేకెత్తించింది.

ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పోటీలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే విదేశాల్లో శిక్షణ కోసం బజరంగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రూ. 9 లక్షలు మంజూరు చేసింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయంతో బజరంగ్ ఒలింపిక్ కల చెదిరినట్లయింది. యూడబ్ల్యూడబ్ల్యూ తనపై వేటు వేయడంపై బజరంగ్ స్పందించాడు. ‘ సస్పెన్షన్ గురించి వరల్డ్ రెజ్లింగ్ బాడీ నుంచి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. దీనిపై పోరాడుతా. ఇక సాయ్ రూ. 9 లక్షలు మంజూరు చేసినప్పటికి.. నేను ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్లడం లేదు. నా ట్రిప్ ప్లాన్‌ను క్యానిల్స్ చేసుకున్నా’ అని బజరంగ్ పేర్కొన్నాడు బదులిచ్చాడు. మరోవైపు ఈ అంశంపై యూడబ్ల్యూడబ్ల్యూ స్పందించింది. పూనియాను సస్పెండ్ చేయడానికి గల కారణాలను అతడి ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించింది.