కోహ్లీ కమాల్

10-05-2024 02:25:41 AM

బెంగళూరుకు వరుసగా నాలుగో విజయం, పంజాబ్ ఖేల్ ఖతం

బెంగళూరు వరుస విజయాల పరంపర కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడ్డ తర్వాత వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. హిమాలయ పర్వత సానువుల్లో వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించగా.. రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్ అతడికి సహకరించారు. స్ట్రయిక్ రేట్ విషయంలో చర్చకు తెరదించుతూ.. ధర్మశాలలో విరాట్ దుమ్మురేపాడు. కళాత్మక కవర్ డ్రైవ్‌లతో పాటు.. అంతే అద్భుతమైన సిక్సర్లతో స్టేడియాన్ని మోతెక్కించాడు. ఇక ఛేదనలో పంజాబ్ కాస్త పోరాడినా.. లక్ష్యానికి 60 పరుగుల దూరంలో నిలిచిపోయి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగింది. 

ధర్మశాల: ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దుమ్మురేపుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న బెంగళూరు వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో శతకం కోల్పోగా.. రజత్ పాటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (9), విల్ జాక్స్ (12) విఫలం కాగా.. చివర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 18; ఒక ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, విద్వత్ కవెరప్ప రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రొసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. శశాంక్ సింగ్ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (27), సామ్ కరన్ (22) పర్వాలేదనిపించారు. ఇప్పటికే పొట్టి క్రికెట్‌లోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన పంజాబ ఒక దశలో మరోసారి అద్భుతం చేస్తుందా అనిపించినా.. రొసో ఔటైన తర్వాత ఆ జట్టు కోలుకోలేకపోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (6), జితేశ్ (5), లివింగ్ స్టోన్ 90), అశుతోష్ (8) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3, ఫెర్గూసన్, స్వప్నిల్, కర్ణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లీగ్ లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. 

క్లాస్+మాస్= విరాట్

మ్యాచ్ ఏదైనా మైదానంలో అడుగు పెడితే వంద శాతం కష్టించే విరాట్ కోహ్లీ మరో చక్కటి ఇన్నింగ్స్‌తో ఆలరించాడు. టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న వేళ విరాట్ తన విలువ చాటుకున్నాడు. పొట్టి కప్పుకు కోహ్లీని ఎంపిక చేయడానికి ముందు అతడి స్ట్రయిక్ రేట్ గురించి తీవ్ర చర్చ జరగిన విషయం తెలిసిందే. ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో దూకుడుగా ఆడితే చాలు.. ఆ ఆటగాడిని జట్టుకు ఎంపిక చేయాలని డిమాండ్ వినిపించే మన దేశంలో సుదీర్ఘ కాలంగా నిలకడగా ఆడుతున్న ఆటగాడి విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికీ స్ట్రయిక్ రేట్ గుర్తొస్తోంది. అయితే తాజా సీజన్‌లో దుమ్మురేపుతున్న కోహ్లీ.. తనలోని క్లాసిక్ టచ్‌ను మరోసారి చూపాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో ధిట్ట అయిన విరాట్.. గురువారం హిమాలయ పర్వత సానువుల్లో జరిగిన పోరులో విశ్వరూపం కనబర్చాడు.

క్లాసిక్ కవర్ డ్రైవ్‌లతో పాటు.. అంతే సొగసైన లాఫ్టెడ్ సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. దాదాపు బంతికి రెండు పరుగుల చొప్పున సాధించిన విరాట్.. నెమ్మదిగా ఆడతాడు అని విమర్శించే వాళ్ల నోళ్లు మూయించాడు. సాధారణంగా విరాట్ క్రీజులో ఉన్న సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై తక్కువ ఓత్తిడి ఉంటుంది. అలాంటిది ఐపీఎల్లో మాత్రం దాదాపు కోహ్లీది ఒంటరి పోరాటం అనే చెప్పాలి. ఒకటి అరా మ్యాచ్‌ల్లో తప్ప విరాట్ మినహా ఆర్సీబీ తరఫున నిలకడగా రాణించిన ఆటగాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఈ మ్యాచ్‌లోనూ అదే స్థితి. మూడో ఓవర్‌లోనే కెప్టెన్ డుప్లెసిస్ ఔట్ కాగా.. కాసేపటికే విల్ జాక్స్ సైతం వెనుదిరిగాడు. దీంతో ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత మరోసారి కోహ్లీ భుజాలపై పడింది. ఈ దశలో రజత్‌తో కలిసి అతడు పరిస్థితిని చక్కదిద్దాడు. కోహ్లీ అండతో రజత్ రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండ్రీలు సిక్సర్లు బాది 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

కాసేపటికి విరాట్ 32 బాల్స్‌లో ల్యాండ్‌మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను నేలపాలు చేసిన పంజాబ్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. అర్ధశతకం తర్వాత మరింత రెచ్చిపోయిన కోహ్లీ మరో 14 బంతుల్లో 42 రన్స్ కొట్టి శతకం సాధించేల కనిపించాడు. అయితే అర్ష్‌దీప్ వేసిన వైడ్ యార్క్‌ర్‌ను భారీ షాట్ కొట్టే క్రమంలో రొసోకు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. ఆఖర్లో గ్రీన్, కార్తీక్ వేగంగా ఆడటంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ పర్వాలేదనిపించింది. రొసో రఫ్ఫాడించడంతో ఆ జట్టు 8.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్ దాటింది. ఇదే జోష్‌లో ముందుకు సాగితే పంజాబ్ విజయం పెద్ద కష్టం కాదనిపించినా.. బెంగళూరు బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో పంజాబ్ పనైపో యింది. 

సంక్షిప్త స్కోర్లు

బెంగళూరు: 20 ఓవర్లలో 241/7 (కోహ్లీ 92, రజత్ 55; హర్షల్ 3/38, విద్వత్ 2/36), పంజాబ్: 17 ఓవర్లలో 181 ఆలౌట్ (రొసో 61, శశాంక్ 37; సిరాజ్ 3/43, స్వప్నిల్ 2/28).