గుట్కా వ్యసనం.. దెబ్బతిన్న దవడ
- కాలి ఎముకతో దవడ పునర్నిర్మాణం
- కామినేని హాస్పిటల్స్ వైద్యుల అద్భుత శస్త్రచికిత్స
- క్యాన్సర్ బారిన పడ్డ 39 ఏండ్ల కూలీకి పునర్జన్మ
ఎల్బీనగర్, జూన్ 9 : సుదీర్ఘకాలంలో గుట్కా నమలడంతో దెబ్బతిన్న దవడ భా గాన్ని ఎల్బీనగర్‌లోని కామినేని దవాఖాన వైద్యులు కాలి ఎముకతో దవడ నిర్మాణాన్ని పునః నిర్మించి, ఒక వ్యక్తికి ప్రాణదానం చేశా రు. ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్స్ వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు. క్యాన్సర్ మహమ్మారితో దవడ ఎముక పూర్తిగా దెబ్బతిన్న ఒక 39 ఏళ్ల దినసరి కూలీకి, అతని కాలి ఎముకను (ఫిబులా) సేకరించి దవడను విజయవంతంగా పునర్నిర్మించారు.
వైద్యులు తెలిపిన వివరాలు... సదరు రోగి గత 12 ఏళ్లుగా గుట్కా నమలడం, పొగతాగే అలవాటు ఉండడంతో అతని కుడివైపు కింది దవడ లోపలి భాగం లో నయం కాని ఒక తీవ్రమైన పుండు (అల్సర్) ఏర్పడింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, అతను కనీసం ఒకటిన్నర వేళ్ల వెడల్పు కూడా నోరు తెరవలేకపోయాడు. ఈ క్రమంలోనే అతను కామినేని ఆసుపత్రిని ఆశ్రయించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి బయాప్సీ ద్వారా అది బుగ్గ లోపలి భాగంలో వచ్చిన క్యాన్సర్గా నిర్ధారించారు.
అప్పటికే ఆ క్యాన్సర్ కుడి దవడ ఎముకకు కూడా తీవ్రంగా పాకింది. రోగి ప్రాణాలను కాపాడటంతోపాటు అతని ముఖ రూపాన్ని కాపాడేందుకు కామినేని హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ డీవీ వినీత్ నేతృత్వంలోని నిపుణుల బృందం క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి, క్యాన్సర్ సోకిన దవడ భాగాన్ని, మెడలోని ప్రభావిత గ్రంథులను తొలగించడానికి ’కాంపోజిట్ రిసెక్షన్’, ’సెగ్మెంటల్ మాండిబ్యులెక్టమీ’, ’మోడిఫైడ్ రాడికల్ నెక్ డిస్సెక్షన్’ వంటి క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.
అయితే, దవడ ఎముకను తొలగించడంతో ముఖం వికృతంగా మారకుండా ఉండేందుకు కామినేని ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ బి.కృష్ణ చైతన్య ’మైక్రోవాస్కులర్’ (సూక్ష్మరక్తనాళాల) పద్ధతిని ఎంచుకుని రోగి కాలి నుంచి ఎముక, దానికి సంబంధించిన కణజాలాన్ని సేకరించి (ఫ్రీ ఫిబులా ఆస్టియోక్యుటేనియస్ ఫ్లాప్), దానిని దవడ ఆకారంలోకి మలచి ముఖానికి అమర్చారు. ఒకే విడతలో జరిగిన ఈ హై-స్టేక్స్ ఆపరేషన్ ద్వారా రోగి ముఖ రూపాన్ని, దవడ పనితీరును యథాతథంగా పునరుద్ధరించ గలిగారు.
ప్రస్తుతం రోగి కోలుకున్నాడని, ముఖం, దవడ నిర్మాణం మునుపటిలా ఉందని వైద్యులు తెలిపారు. తంబాకు, గుట్కా అలవాట్ల వల్ల వచ్చే నోటి క్యాన్సర్లు మళ్లీ తిరగబెట్టకుండా ఉండాలంటే త్వరితగతంగా వైద్యం చేయాల్సి ఉంటుందని డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. ఆధునిక మైక్రోసర్జరీ ద్వారా క్యాన్సర్ రోగులు తిరిగి ఆత్మవిశ్వాసంతో సాధారణ జీవితాన్ని గడపవచ్చని డాక్టర్ కృష్ణ చైతన్య స్పష్టం చేశారు. గుట్కా వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, నోటిలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కామినేని దవాఖాన వైద్యులు సూచించారు.






