ఇందిరమ్మ రాజ్యంలో చేనేత సంక్షోభం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేత రంగం ఇందిరమ్మ రాజ్యం పేరుతో తెచ్చిన ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖలో పేర్కొంటూ కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ కాంగ్రెస్ వచ్చి ఆర్నెల్లలోనే అలాంటి విషాదకర పరిస్థిని ఎదుర్కొంటుందన్నారు.
తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయాలనే కక్షపూరిత వైఖరితో నేడు నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ చేశారని మండిపడ్డారు. చేనేత కార్మికులు, పవర్ లూమ్స్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంచాలను తూకం వేసి అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు. రోజురోజుకు పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. కేవలం ప్రభుత్వ పాలనా వైఫల్యంతోనే మగ్గాల కార్మిక క్షేత్రంలో మరణ మృదంగం మోగుతోందని, మళ్లీ నేతలన్న ఆకలిచావులు ఆవేదన కలిగిస్తున్నాయని తెలిపారు. నేతన్నల బలవన్మరణాలను ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ గత ప్రభుత్వాల ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నడూ నేతన్నల కష్టాలు పట్టించుకున్న చరిత్ర లేదన్నారు.
కేంద్రం అసమర్థత విద్యార్థులకు శాపం
కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎక్స్ వేదికగా సోమవారం స్పందిస్తూ బీజేపీ నేతృత్యంలో ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. నీట్ పేపర్ లీకైనా జూలై 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఎలాంటి కారణాలు చూపకుండా నీట్ పీజీ పరీక్ష వాయిదా వేశారని తెలిపారు. వీటిన్నంటికి కారణం నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న నీట్ యూజీ పేపర్ లీకైంది. జూన్ 19న యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేశారు. జూన్ 21న సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా వేశారు. జూన్ 22న చివరి నిమిషంలో నీట్ పీజీటీ పరీక్షను వాయిదా వేశారని మండిపడ్డారు.






