కృషి, పట్టుదల, గుండె ధైర్యం, ఆమె సొంతం
సంస్కృతి, సాంప్రదాయాలతో కూడిన విద్యా బోధనే ‘ఆమె‘ లక్ష్యం..
60మందికి ఉపాధి కల్పిస్తున్న ‘ఆమె’.
తాండూరు, మార్చి 8, (విజయ క్రాంతి): కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం, ఓపిక ..ఇవన్నీ ఆమెకే సొంతం.. ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న నానుడి వంటబట్టిన ఆమె విద్యారంగంలో అడుగుపెట్టి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ విజయం వైపు దూసుకు వెళుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల డైరెక్టర్ మణిమాల.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
గత పదేళ్ల క్రితం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుపై కేవలం 40 మంది విద్యార్థులతో పాఠశాలను ఆమె ప్రారంభించింది. సాంప్రదాయ, సంస్కృతితో కూడిన విద్యను అందించడంతో నేడు రెండు బ్రాంచీలు ఏర్పాటు చేసి దాదాపు 1500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుండ డంతో అనతి కాలంలోనే ప్రముఖ విద్యాలయంగా పేరు పొందింది. పదవ తరగతిలో ఏటా 100% ఉత్తీర్ణత సాధిస్తూ పట్టణంలో అగ్రగామి విద్యాసంస్థగా విజయ డంకా మ్రోగిస్తోంది. తన విజయం వెనుక భర్త రవీందర్ రెడ్డి ప్రోత్సాహం, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని పాఠశాల డైరెక్టర్ మణిమాల అంటున్నారు.
తాండూర్ పట్టణానికి చెందిన మణిమాల బీఏడ్ పూర్తి చేసి గృహిణిగా ఉండేది. భర్త రవీందర్ రెడ్డి ప్రోత్సాహంతో కేవలం 40 మంది విద్యార్థులతో శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పేరుతో ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. ఆమె కృషి, పట్టుదలతో విజయాలను అందుకుంటూ హైస్కూల్ స్థాయికి తీసుకువ చ్చారు. పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తూ పట్టణ ప్రముఖులు విద్యావేత్తల అభినందనలు అందుకున్నారు. పాఠశాలలో ఎల్ కే జి నుండి పదవ తరగతి వరకు స్మార్ట్ క్లాసులతోపాటు కంప్యూటర్ తో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్న విద్యా సంస్థగా పాఠశాలకు పేరు వచ్చింది.
విద్యాభ్యాసంలో వెనుక పడ్డ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని సైతం ముందువరుసలో ఉండేటట్లు చూస్తున్నారు ఆమె. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆమె నేడు దాదాపు 60 మంది మంది సిబ్బందికి ఉపాధి (టీచింగ్ నాన్ టీచింగ్) కల్పిస్తూ అకుంఠిత దీక్షతో తాండూర్ పట్టణంలో విద్యాభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృషి ఎనలేనిది. ఓ మహిళగా మణిమాల సాధిస్తున్న విజయపరంపర ఇక ముందు కూడా కొనసాగాలని మనము కోరుకుందాం.




