అక్రమ మైనింగ్ ఆగేనా?
- అక్రమ మైనింగ్ జరిగితే కలెక్టర్, ఎస్పీలను సస్పెండ్ చేస్తామన్న సీఎం
- మేడ్చల్ జిల్లాలో జోరుగా దందా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
- ఇటుక బట్టీలకు సైతం అక్రమ మట్టి
మేడ్చల్, మార్చి 8 (విజయ క్రాంతి): అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. జిల్లాలో ఎక్కడైనా అక్రమ మైనింగ్ జరిగితే కలెక్టర్, ఎస్పీలను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిం చారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం ఈ హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్, ఎస్పీలను సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించడంతో అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది. మేడ్చల్ జిల్లాలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు.
జిల్లాలో 16 క్రషర్లకు ప్రభుత్వ అనుమతి ఉంది. వీటి యజమానులు గనులలో అనుమతి పొందిన దాని కంటే ఎక్కువ రేట్లు తవ్వకాలు జరుపుతున్నారు. పెద్ద గుంతలు లోతుగా తవి రాయితీస్తున్నారు. ఈ గుంతలు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. వీటిలో పడి అనేకమంది దుర్మరణం చెందారు. క్రషర్ యజమానులు అనుమతి కంటే ఎక్కువగా తవ్వి రాయల్టీ ఎగ్గొడుతున్నారు. అంతేగాక టిప్పర్లలో పరిమితికి మించి రవాణా చేస్తున్నారు. అధిక లోడ్ వల్ల రహదారులు చిద్రమవుతున్నాయి.
జోరుగా మట్టి, ఇసుక తవ్వకాలు
జిల్లాలో మట్టి ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మేడ్చల్, షామీర్పేట్, కీసర మండలాల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి మట్టి సమీప పట్టణాలకు రవాణా చేస్తున్నారు. వాగుల నుంచి ఇసుకను కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. షామీర్పేట్, మూడు చింతలపల్లి మండలాల నుంచి ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోంది.
ఇటుక బట్టీలకు అక్రమ మట్టి
ఇటుక బట్టీల యజమానులు ఇటుకల తయారీకి అక్రమ మట్టిని వినియోగిస్తున్నారు. ఇటుక బట్టీల యజమానులు మట్టి తీసుకోవడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. ఇటుక బట్టే ఏర్పాటు చేసిన చోట లేదా ఇతర ప్రాంతాల నుంచి మట్టి తీసుకుంటున్నారు. తయారీకి మట్టి కోసం తప్పనిసరిగా గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధన ఉన్న యజమానులు బేఖాతరు చేస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని మట్టి తవ్వకాలు, ఇసుక రవాణా పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేగాక ఇటుక బట్టీలలో అక్రమ మట్టి వినియోగాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
గనుల శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 2016లో అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ తగినంత సిబ్బందిని నియమించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు సిబ్బంది అదే సంఖ్యలో ఉన్నారు. మేడ్చల్ జిల్లా గనుల శాఖ కార్యాలయంలో ఒక ఏడి, ఆర్ ఐ, క్లర్కు మాత్రమే ఉన్నారు. అంతేగాక తనిఖీలకు వెళ్ళినప్పుడు సిబ్బందికి రక్షణ లేదు. ఇటీవల తనిఖీ సందర్భంగా ఒక అధికారిపై ఒక వ్యక్తి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ అరికట్టాలంటే ముందుగా సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.




