కోతలు ముమ్మరం.. కొనుగోళ్లు ఎన్నడో?
- కుప్పలుగా పేరుకుపోతున్న వరి రాశులు
- ఆందోళనలో అన్నదాతలు వెంటనే కొనుగోళ్లు
- ప్రారంభించాలని వేడుకోలు
చివ్వెంల, ఏప్రిల్ 7 : మండలంలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోతలు మొదలైన వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులకు గురి అవుతున్నారు.
కొనుగోళ్ల జాడేది? :
మార్చి మూడో వారం నుంచే వరి కోతలు ప్రారంభమై ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తరలిస్తున్నప్పటికీ కొనుగోళ్లు జరగకపోవడంతో నిల్వ సమస్యలు తీవ్రంగా మారాయి.
పదిహేను రోజులుగా రైతులు ధాన్యాన్ని కుప్పలుగా వేసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నా, ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ కూడా అధికారికంగా కొనుగోలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఏర్పాటు చేయాల్సిన 22 ఐకేపీ, 5 పిఎసిఎస్, 3 మెప్మా కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. గతంలో కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే రైతులు ధాన్యం రాశులు పోసి వేచి చూస్తున్నారు.
కలవరపడుతున్న రైతులు..
ఎండల కారణంగా తేమ శాతం అనుకూలంగా ఉన్నప్పటికీ, అకాల వర్షాల భయం రైతులను కలవరపెడుతోంది. ఇతర ప్రాంతాల్లో వారం రోజుల క్రితమే ధాన్యం కేంద్రాలకు రాక ప్రారంభమైనప్పటికీ, కొనుగోళ్లు ఎక్కడా ప్రారంభం కాలేదని రైతులు చెబుతున్నారు. ధాన్యం కుప్పలుగా పేరుకుపోవడంతో వాటి రక్షణ కూడా సమస్యగా మారింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇదే సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల ముప్పు ఉండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తమను మండల రైతులు కోరుతున్నారు.
ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియట్లే
వడ్లను గతంలో ధాన్యం కొనుగోలు చేసిన చోటుకు తీసుకువచ్చి 10 రోజులు అవుతోంది. కొనుగోలు కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియట్లేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఈ విధమైన ఏర్పాట్లు చేయలేదు ఈడ పరిస్థితి చూస్తుంటే ఇంకా సమయం పట్టేటట్టు ఉంది.
అనిల్ రావు, రైతు, చందుపట్ల
రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం
మండలంలోని రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
- వెంకయ్య, ఏపీఎం, చివ్వెంల




