వెంటాడిన యుద్ధ భయాలు
l వరుసగా రెండోరోజూ స్టాక్స్ పతనం l సెన్సెక్స్ 845 పాయింట్లు డౌన్ l 234 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై, ఏప్రిల్ 15: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ పతనమయ్యింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే యుద్ధానికి దారితీస్తుందన్న భయాలు వెంటాడటంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబ డ్డారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 845 పాయి ంట్ల మేర పతనమై 73,400 పాయింట్ల వద్ద నిలిచింది. శుక్రవారం 793 పాయింట్లు (1.06 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే. వరుస రెండు రోజుల్లో 1,600 పాయింట్లకు పైగా సూచీ పతనమయ్యింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తాజా గా 247 పాయింట్ల నష్టంతో 22,272 పాయి ంట్ల వద్ద నిలిచింది.
వరుస రెండు రోజుల్లో ఈ సూచి 480 పాయింట్లకుపైగా పడిపోయి ంది. యుద్ధ భయాలకు తోడు యూఎస్‌లో మార్చి ద్రవ్యోల్బణం 3.5 శాతానికి పెరగడమూ బుల్స్‌ను నిరుత్సాహపర్చిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ద్రవ్యోల్బణం పెరిగినందున ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల్ని జాప్యం చేస్తుందన్న అంచనాలతో విదేశీ ఫండ్స్ విక్రయాలు జరిపినట్టు ట్రేడర్లు చెప్పారు.అటు అమెరికా నుంచి ఇటు ఆసియా వరకూ ప్రధాన స్టాక్ సూచీలు భారీ నష్టాల్ని చవిచూశాయి. శుక్రవారం రాత్రి అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ నాస్‌డాక్ ఇండెక్స్‌లు 1 శాతంపైగా పతనం కాగా, సోమవారం ఉదయం జపాన్, కొరి యా, హాంకాంగ్ మార్కెట్లు క్షీణించగా, చైనా షాంఘై లాభపడింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సెంటిమెంట్‌కు దెబ్బ
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంచనాల్ని మించి యూఎస్ ద్రవ్యోల్బణం పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఫిబ్రవరికంటే మార్చిలో యూఎస్ ఇన్‌ఫ్లేషన్ మరింత పెరగడంతో ట్రెజరీ ఈల్డ్స్ ఎగిసాయని, దీంతో ఈ ఏడాది మూడు రేట్ల కోతలు ఉంటాయన్న ఇన్వెస్టర్ల ఆశలు అడుగంటాయని క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా దేశీయ మార్కెట్లో అమ్మకాలకు పురికొల్పిందని వివరించారు. అధిక విలువలు, క్యూ4 లాభాల వృద్ధిపై అంచనాలు తగ్గడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు భారీగా జరిగాయన్నారు.
5.18 లక్షల కోట్లు తగ్గిన సంపద
ఇరాన్ ఉద్రిక్తతల నడుమ జరిగిన తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.5.18 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 5,18,953.97 కోట్లు తగ్గి 3,94,48,097.94 కోట్లకు (4.73 ట్రిలియన్ డాలర్లు) చేరింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు.






