16 July, 2026 | 9:09 PM

మూడో రోజూ అదే తీరు

17-04-2024 12:10 AM

ముంబై, ఏప్రిల్ 16: ఒక వైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు ఆవిరైపోవడంతో బుల్స్ మార్కెట్ వదిలి పరుగులు తీస్తున్నారు. మంగళవారం వరుసగా మూడో రోజూ స్టాక్స్ పతనం కొనసాగింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 456 పాయింట్ల మేర క్షీణించి 72,944 పాయింట్ల వద్ద నిలిచింది.  వరుస మూడు రోజుల్లో 2,100 పాయింట్ల వరకూ సూచీ పతనమయ్యింది.  ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తాజాగా మరో 125 పాయింట్ల నష్టంతో 22,148 పాయింట్ల వద్ద నిలిచింది. మూడు రోజుల్లో ఈ సూచి 600 పాయింట్లకుపైగా పడిపోయింది. యుద్ధ భయాలకు ప్రపంచ మార్కెట్లన్నీ కునారిల్లిన సమయంలోనే బుల్స్‌ను నిరుత్సాహపర్చే రెండు వార్తలు అమెరికా నుంచి వెలువడ్డాయి. మార్చి నెలలో ద్రవ్యోల్బణం అంచనాల్ని మించి 3.5 శాతం పెరగడం, రిటైల్ అమ్మకాలు 0.7 శాతం వృద్ధిచెందడంతో యూఎస్ ఫెడ్ జూన్ నెలలో వడ్డీ రేట్లు తగ్గించదంటూ మార్కెట్లు డీలా పడ్డాయి. జూన్‌తో మొదలుపెట్టి ఈ ఏడాది కనీసం మూడు దఫాలు వడ్డీ రేట్ల కోతలుంటాయన్న అంచనాలు ఇప్పటివరకూ ఉండగా, అమెరికాలో వెలువడిన తాజా గణాంకాలు ఆ అంచనాల్ని నీరుకార్చాయని మార్కెట్ నిపుణలు వివరించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల్ని జాప్యం చేస్తుందన్న అంచనాలతో విదేశీ ఫండ్స్ విక్రయాలు జరుపుతున్నట్టు ట్రేడర్లు చెప్పారు.అటు అమెరికా నుంచి ఇటు ఆసియా వరకూ ప్రధాన స్టాక్ సూచీలు భారీ నష్టాల్ని చవిచూశాయి. సోమవారం రాత్రి అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ నాస్‌డాక్ ఇండెక్స్‌లు 0.75 శాతం నుంచి 1.50 శాతం వరకూ పతనంకాగా, మంగళవారం ఉదయం జపాన్, కొరియా, హాంకాంగ్, చైనా తదితర ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ కుప్పకూలాయి. 

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోసెంటిమెంట్‌కు దెబ్బ

 భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంచనాల్ని మించి యూఎస్ ద్రవ్యోల్బణం పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఫిబ్రవరికంటే మార్చిలో యూఎస్ ఇన్‌ఫ్లేషన్ మరింత పెరగడంతో ట్రెజరీ ఈల్డ్స్ ఎగిసాయని, దీంతో ఈ ఏడాది మూడు రేట్ల కోతలు ఉంటాయన్న ఇన్వెస్టర్ల ఆశలు అడుగంటాయని  క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా దేశీయ మార్కెట్లో అమ్మకాలకు పురికొల్పిందని వివరించారు. అధిక విలువలు, క్యూ4 లాభాల వృద్ధిపై అంచనాలు తగ్గడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు భారీగా జరిగాయన్నారు. 

విదేశీ విక్రయాలు రూ.15 వేల కోట్లు 

ఏప్రిల్ తొలివారంలో వరుసగా పెట్టుబడులు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు )హఠాత్తుగా మార్కెట్ నుంచి నిధులు వెనక్కు తీసుకుంటున్నారు. శుక్రవారం రూ. 8,000 కోట్లకుపైగా నికర విక్రయాలు జరిపిన ఎఫ్‌పీఐలు సోమవారం మరో రూ. 3,268 కోట్లను వెనక్కు తీసుకోగా, మంగళవారం రూ.4,468 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.