9 August, 2026 | 3:23 PM

హానికరంగా హాస్టళ్లు!

20-06-2024 01:00 AM
  • కుళ్లిన కూరగాయలు, కాలంచెల్లిన సరుకులు
  • సింథటిక్ రంగులు, గలీజుగా వంటగదులు
  • గుట్కా తింటూనే వంట మనిషి పని
  • అనుమతులు లేకుండానే హాస్టళ్ల నిర్వహణ 
  • ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ఆహార నాణ్యతలో డొల్లతనం మరోసారి గుట్టు రట్టయింది. హాటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో వెలుగుచూసిన భయంకర పరిస్థితు లు.. తాజాగా హాస్టళ్లలో బయటపడ్డాయి. అపరిశుభ్రమైన పరిసరాలు, హానికరమైన పదార్థాలు, అధ్యానంగా వంటగదులు దర్శనమిచ్చాయి.  గ్రేటర్ హైదరాబాద్‌లో సరిగ్గా నెల రోజుల క్రితం దాదాపు 150కి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో  ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి దాడులలో నమ్మలేని నిజాలు బహిర్గతం చేశారు. వందలు, వేలు ఖర్చు చేసి రోజూ మనం తినే ఆహారం ఎంత కల్తీ అవుతుందో కళ్లకు కట్టారు.  దాదాపు 150కి పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో 50కిపైగా కేసులు నమోదయ్యాయి.  మాదాపూర్‌లోని బిగ్ బాస్కెట్ గోడౌన్ సైతం సీజ్ చేశారు. 

అధ్వానంగా హాస్టళ్లు.. 

తాజాగా వర్కింగ్ వుమన్ హాస్టళ్లలో అవే పరిస్థితులు వెలుగు చూడడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మాదాపూర్‌లోని సిందూజద్దూ డీలక్స్ మెన్స్ హాస్టళ్లు, ఓంశ్రీసాయి నందా డీలక్స్ మెన్స్ హాస్టల్, తనూశ్రీ గ్రాండ్ విమెన్స్ హాస్టల్, ఓం శ్రీసాయి నందా విమెన్స్ హాస్ట ల్, ఎస్‌ఆర్ లేడీస్ హాస్టళ్లలో  ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల వివరాల ను బుధవారం వెల్లడించారు. ఓం శ్రీసాయినం దా హాస్టల్‌లో వంట చేసేటప్పుడు, వడ్డించే సమయంలో సిబ్బంది గుట్కా నములుతున్నట్టు గుర్తించా రు. కూరల్లో సింథటిక్ కలర్ వినియోగిస్తున్నట్టు పసిగట్టారు.

కుళ్లిన కూరగాయలు, గడువు తీరిన సరుకులను వాడుతున్నట్లు గమనించారు. కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింక లు, బల్లులు తిరగాడడాన్ని గుర్తించారు. నాసిరకం సోయాసాస్‌ను కనుక్కున్నారు. సింధూ జద్దూ విమెన్స్ హాస్టళ్లలో కారం చెల్లిన కారం పొడి, మూతల్లేని డస్ట్‌బిన్లు, అపరిశుభ్ర వాతావరణంతో అవాక్కయ్యారు.  తనూశ్రీ గ్రాండ్ విమెన్స్ హాస్టల్‌లో బొద్దింకలు చూసి కంగుతిన్నారు. నాసిరకం సాస్, తుప్పు పట్టిన దోస పెనంను గుర్తించారు.

అనుమతులు లేకుండానే నిర్వహణ

జీహెచ్‌ఎంసీ పరిధిలో  వర్కింగ్ హాస్టల్స్ పుట్ట గొడుగుల్లా  వెలిశాయి.  వీటికి సంబంధించిన నిర్ధిష్టమైన సమాచారం కానీ, వివరాలు కానీ జీహెచ్‌ఎంసీ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. చాలా వరకూ అపార్ట్‌మెంట్లలోనే హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. చాలావాటికి కనీస అనుమతులు కూడా లేవనే నిజాలు అధికారులను విస్తుబోయేలా చేశాయి.  మాదాపూర్‌లో5 హాస్టళ్లు అనుమతులు లేకుండానే సాగుతున్నట్లు గుర్తించారు. చివరకు ఆయా ఈ హాస్టళ్ల నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. కేసులు నమోదు చేశారు.