పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
- సర్పంచ్ చింతకింది ప్రవీణ్ రెడ్డి
- ఎత్బార్పల్లిలో సొంత నిధులతో చెత్త డబ్బాలు, సీసీ కెమెరాల ఏర్పాటు
మొయినాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ఎత్బార్పల్లి గ్రామ సర్పంచ్ చింతకింది ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎత్బార్పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు.గ్రామ సభలో తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు గ్రామంలోని సుమారు 200 ఇళ్లకు సర్పంచ్ తన సొంత నిధులతో ప్రతి ఇంటికి నాలుగు డబ్బాల చొప్పున పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇంటి వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసి గ్రామ పంచాయతీ చెత్త బండిలో వేయాలని కోరారు.
చెత్తను ఇళ్ల ముందు, సందుల్లో వేయడం వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హిమబిందు, ఉపసర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటు గ్రామంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ కోసం సర్పంచ్ చింతకింది ప్రవీణ్ రెడ్డి రూ.4.50 లక్షల సొంత నిధులతో 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ సీసీ కెమెరాలను మొయినాబాద్ సీఐ వై. మల్లికార్జున రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచ్ ప్రవీణ్ రెడ్డిని అభినందించారు.






