చెరువు.. ఆనవాళ్లు కరువు..!
మండలంలోని చెరువులు, కుంటల్లో భారీగా పెరిగిన జమ్ముగడ్డి, ఇతర మొక్కలు
అద్వాన్నంగా మారిన చెరువు కట్టలు
తగ్గిన నీటి నిల్వలు
పునర్జీవం పోయాలని రైతుల వేడుకోలు
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జూన్ 10: మండల పరిధిలోని పలు గ్రామాల్లో చెరువులు,కుంటలు ప్రస్తుతం అత్యంత దయనీ యస్థితికి చేరుకున్నాయి. ఒకప్పుడు ఎటు చూసినా నిండుకుండలా కనిపిస్తూ సాగునీటికి ఆధారంగా నిలిచిన ఈ వనరులు సరైన నిర్వహణ లేక ఉనికిని కోల్పోతున్నాయి. జాజిరెడ్డిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న మెజారిటీ చెరువులు, కుంటల్లో జమ్ముగడ్డి, గుర్రపుడెక్కతో పాటు నిరుపయోగ మొక్క లు భారీగా పెరిగాయి. దీనివల్ల నీటి సామ ర్థ్యం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా చెరువులు ఎక్కడున్నాయో కూడా గుర్తుపట్టలేనంతగా మొక్కలు పెరిగాయి.
నిధులలేమితో నిలిచిన నిర్వాహణ
మండల పరిధిలో సుమారు 81 చెరువులు, కుంటలు ఉన్నాయి. గత కొంతకా లంగా ప్రభుత్వం నుంచి వీటికి సంబంధించి ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం, నిధుల కొరత ఉండడంతో ఈ పరి స్థితి దాపురించింది. కనీసం పూడికతీత పను లు కానీ నిరుపయోగ మొక్కల తొలగింపు పనులు గాని జరగడం లేదు. సాగునీటి వనరులు ఇలా నిరుపయోగంగా మారుతుండ డంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నిధు లు మంజూరి చేసి చెరువులకు పునరుజ్జీవం పోయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
అధ్వాన్నంగా మారిన చెరువు కట్టలు
చెరువుల, కుంటల లోపలే కాకుండా వాటి కట్టలు సైతం నిరుపయోగ చెట్లతో కంప పొదలతో నిండిపోయాయి. కట్టల నిర్వహణను గాలికొదిలేయడంతో అవి ధ్వంసం అవుతుండడమే కాకుండా రైతులు, ప్రజలు కనీసం చెరువు కట్టలపై నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ దట్ట మైన పొదల కారణంగా చెరువు కట్టపైకి వెళ్లాలంటేనే భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.
పూర్తిస్థాయిలో నీళ్లు నిలిచేలా చర్యలు తీసుకోవాలి
చెరువులు,కుంటలు జమ్ముగడ్డి, పి చ్చి మొక్కలతో నిండిపోయా యి. మా గ్రా మంలో ఉన్న రంగారెడ్డి, ముత్యాలమ్మ చెరువుతోపాటు కుంటలు చెట్లతో నిండిపోయాయి. చెరువు కట్టలకు సైతం ఇరువైపులా కంపచెట్లతో నిండి ప్రమాదకరంగా మారాయి. కట్టలపై ఉన్న కంపచెట్లను తొలగించి, చెరువుల్లో ఉన్న మొక్కలను తీసివేసి పూర్తిగా నీళ్లు నిలిచేలా చర్యలు తీసుకోవాలి.
కలకోట్ల నర్సయ్య, రైతు అడివెంల






