కేకేఆర్ చేతికి హెల్థియం మెడ్‌టెక్
రూ.7,000 కోట్ల లావాదేవీ
ముంబై, మే 6: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కేకేఆర్ హెల్త్‌కేర్ రంగానికి చెందిన మరో కంపెనీని కొనుగోలు చేసింది. మెడికల్ డివైజెస్ కంపెనీ హెల్థియం మెడ్‌టెక్‌ను (గతంలో స్యూచర్స్ ఇండియా) చేజిక్కించుకుంది. ఈ హెల్థియం మెడ్‌టెక్‌కు ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అపెక్స్ పార్టనర్స్ యజమానిగా ఉన్నది.
అపెక్స్ పార్టనర్స్ నుంచి హెల్థియం మెడ్‌టెక్‌ను కొనుగోలు చేసినట్టు సోమవారం కేకేఆర్ ప్రకటించింది. ఎంత ధరకు కొన్నదీ కేకేఆర్ వెల్లడించినప్పటికీ, ఈ లావాదేవీ విలువ రూ.7,000 కోట్ల మేర ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తు న్న హెల్థియం మెడ్‌టెక్ ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ పెద్ద సర్జికల్ స్యూచర్ తయా రీ కంపెనీ. అలాగే సర్జికల్ నీడిల్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా పెద్దది.
హెల్త్‌కేర్‌లో దూకుడు
భారత్‌లోనూ, ఆసియా పసిఫిక్ దేశాల్లోనూ హెల్త్‌కేర్ రంగంలో కేకేఆర్ భారీ పెట్టుబడుల్ని చేస్తున్నది. గతంలో ఫార్ములేషన్స్ తయారీ ఫార్మా కంపెనీ జేబీ కెమిక ల్స్‌ను, హాస్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జెనెరిక్ ఇంజెక్ట్‌బుల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లాండ్ ఫార్మాను కేకేఆర్ టేకోవర్ చేసింది. ఇతర ఆసియా దేశాల్లో కూడా కేకేఆర్ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియోలోకి కొన్ని కంపెనీలు వచ్చాయి.






