మూడో పెద్ద వినియోగ మార్కెట్‌గా భారత్
జర్మనీ, జపాన్ దేశాలను మించుతుందన్న యూబీఎస్
న్యూఢిల్లీ, మే 6: భారత్ మూడవ పెద్ద వినియోగ మార్కెట్‌గా అవతరిస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ యూబీఎస్ తెలిపింది. 2028కల్లా జర్మనీ, జపాన్ వినియోగాన్ని భారత్ అధిగమిస్తుందని సోమవారం యూబీఎస్ నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగంలో తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉన్నాయి. భారత్‌లో అధికాదాయ వర్గాలు పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది.
2023నాటికి భారత్‌లో 4 కోట్ల మంది (మొత్తం జనాభాలో 4 శాతం) అధికాదాయ వర్గాలవారు (10,000 డాలర్లపైన వార్షిక ఆదాయం) ఉన్నారని, వీరి సంఖ్య వచ్చే ఐదేండ్లలో రెట్టింపు అవుతుందని యూబీఎస్ వివరించింది. 2028కల్లా 10,000 డాలర్లు (రూ.8.5 లక్షలు) పైబడి వార్షిక ఆదాయం కలిగిన వారు 8.8 కోట్ల మంది ఉంటారని తెలిపింది. ప్రస్తుత ఏడాది, వచ్చే సంవత్సరం వినియోగ వృద్ధి తక్కువగానే ఉంటుందని, అటుతర్వాత వేగంగా పుంజుకుంటుందని అంచనా వేసింది. 2011 మధ్యకాలంలో దేశంలో వినియోగం సగటున 6.8 శాతం చొప్పున వృద్ధిచెందగా, ప్రస్తుత, వచ్చే సంవత్సరాల్లో ఈ సగటు 4.5 శాతమే ఉంటుందని యూబీఎస్ వివరించింది.
ఈ రెండేండ్లలో వృద్ధి తక్కువే..
కార్పొరేట్ వేతన వృద్ధి తగ్గనున్నందున, కఠిన ద్రవ్య విధానం అమలవుతున్నందున ఈ రెండేండ్లలో నగరాల్లో మాస్‌మార్కెట్ డిమాండ్ అంతంతగానే ఉంటుందని, అయితే ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ కొనసాగుతుందని పేర్కొంది. రుతుపవనాలు సాధారణంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత కోలుకుంటుందని, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడం కూడా గ్రామీణ రికవరీకి తోడ్పాటు ఇస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ తెలిపింది.






