భారీ వర్షం.. రైతుల హర్షం
- శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిండిన కుంటలు, చెరువులు
- వెలుగుపల్లి- కేశవపురం వద్ద రాకపోకలు బంద్
తుంగతుర్తి, సెప్టెంబర్ 13 : తుంగతుర్తి మండలం లో శనివారం రాత్రి 2 గంటలకు పైగా భారీ వర్షం (Heavy rain) కురిసింది. దీంతో మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా వెలుగుపల్లి ,కేశవాపురం, తూర్పు గూడెం వెంపటి ,తుంగతుర్తి, అన్నారం, తదితర గ్రామాల్లో కుంటలు పొంగుతూ చెరువుల్లోకి భారీ వరద చేరీ మత్తడి దూకుతున్నాయి. తూర్పు గూడెం చెరువు, కేశవపురం బంధం అలుగుల్లో వరద నీరు పరవళ్లు తొక్కుతూ ఆనందింపచేసాయి.
రైతులు ప్రస్తుతం వరి, కంది, పత్తి సాగులకు, అనుకూలమైన వర్షంతో, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వినాయకుని ఆశీస్సులతోనే వర్షాలు పడి చెరువులు ఒకేసారి నిండాయని ఈ ప్రాంతవాసులు ఆనందంగా చెబుతున్నారు. ప్రస్తుతం వెలుగుపల్లి, కేశవపురం మధ్య బంధం వద్ద వరద ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలకు రాకపోకలు తీవ్ర అంతరాయంగా మారింది.