తెలంగాణలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) హెచ్చరించింది. ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. 8 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
హైదరాబాద్ నగరంల(Hyderabad City) సోమవారం మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. నివేదికల ప్రకారం, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో, మధ్యాహ్నం తర్వాత ఒకటి రెండు సార్లు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో కూడా కొనసాగవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సైబరాబాద్ ప్రాంతానికి మధ్యాహ్నం వరకు ఎటువంటి వాతావరణ హెచ్చరిక జారీ చేయలేదు. అయితే, మధ్యాహ్నం తర్వాత నుండి రాత్రి వరకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.






