28 July, 2026 | 10:19 AM

బాటిళ్లలో మూత్ర విసర్జన... వార్డుల్లో దుర్వాసన

28-07-2026 09:48 AM

జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అద్వాన్న పరిస్థితి 

పైప్ లైన్ లు జామ్ మరుగుదొడ్ల కు తాళాలు 

బాటిల్ల లో మూత్రం విసర్జన చేసి బయటపడేసే దుస్థితి

ఆస్పత్రి నిర్వహణపై రోగుల అసహనం

భూపాలపల్లి, జులై 28(విజయక్రాంతి): జిల్లా ప్రధాన ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. నెలల తరబడి మరుగుదొడ్ల పైపులైన్ లు మరమ్మతులు చేయకపోవడంతో ఆసుపత్రికి వచ్చే మహిళా రోగులు గత్యంతనులేని పరిస్థితులు బాటిళ్లలో మూత్ర విసర్జన చేసి బయట పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా మారి, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రోగులు ఆరోగ్య సమస్యలతో పాటు మరుగుదొడ్ల లేమితో అదనపు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా జామ్ అయి పనిచేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.

వార్డుల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో కొందరు రోగులు నీటి బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేసి వాటిని బయట పడేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరికొందరు రోగులు ఈ అసౌకర్యాల కారణంగా పూర్తిగా కోలుకోకముందే ఆసుపత్రి విడిచి ఇంటి ముఖం పడుతున్నారు. మరుగుదొడ్లలో నీటి సరఫరా లేకపోవడం, శుభ్రత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్లడానికే భయపడుతున్నామని రోగులు చెబుతున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లలో పైప్‌లైన్ సమస్యల కారణంగా మరుగుదొడ్లు పనిచేయడం లేదు. ఈ సమస్యపై గత నాలుగు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారి ఇబ్బందులు పడుతున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి 

ఆసుపత్రిలో సుమారు 10 నుంచి 15 మరుగుదొడ్లకు మూడు నెలలుగా తాళాలు వేసారు దీంతో రోగులు, వారి బంధువులు మరుగుదొడ్ల అవసరాల కోసం ఆసుపత్రి బయటకు వెళ్లాల్సి వస్తోంది. పనిచేస్తున్న కొద్ది మరుగుదొడ్లలో కూడా నీటి సదుపాయం లేకపోవడంతో అవి వాడుకలో లేకపోతున్నాయి. దాంతో ఆసుపత్రి పరిసరాల్లో దుర్వాసన వ్యాపిస్తుంది.

సులభ్  సముదాయలు నిర్మించాలి: అమ్ ఆద్మీ  పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

జిల్లా ప్రధాన ఆసుపత్రికి స్థానికులతో పాటు సమీప రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం తీవ్ర అసౌకర్యంగా మారింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఆధునిక సులభ్ సముదాయం నిర్మిస్తే మహిళలు, పురుషులకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి మరుగుదొడ్ల మరమ్మత్తులు చేపట్టి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.