జిల్లా ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు
మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా, జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను గైనకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ రాధిక, డాక్టర్ శశి జ్యోత్స్న కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రికి వచ్చిన వెంటనే అవసరమైన సూచనలు, పరీక్షలు, వైద్య సేవలపై పూర్తి సమాచారం అందించడమే ఈ హెల్ప్ డెస్క్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
హెల్ప్ డెస్క్ నెంబర్ 7993154429 ఈ నంబర్ 24 గంటలు గర్భిణీలకు అందుబాటులో ఉంటుందని, గర్భిణీలు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి సకాలంలో సేవలు అందేలా ప్రత్యేకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రత్యేకంగా 102 అంబులెన్స్ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం, తల్లి-శిశు సంక్షేమ కార్యక్రమాలపై మార్గదర్శకత్వం అందించబడుతుందని తెలిపారు.
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన గర్భధారణ సురక్షిత ప్రసవం కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.హెల్ప్ డెస్క్ ద్వారా నమోదు, పరీక్షలు, ప్రసూతి సేవలు, పోషణ సూచనలు, ప్రభుత్వ పథకాలపై సమాచారం వంటి సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. దీంతో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలు పొందగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం ఆర్ యం ఓలు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ సంజయ్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ లు కేవీ రాజు ఏ . పురుషోత్తం, లోక్య, శ్రీనివాస్, స్వామి హెచ్‌ఈఓ లు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




