ఇక నుంచి ఎలక్ట్రానిక్ పాలసీలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మీరు కొత్తగా తీసుకునే బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలోనే అట్టిపెట్టు కోవాలి. ఇన్వెస్టర్లు వారి షేర్లను డీమ్యాట్ ఖాతాలో ఎలా ఉంచుకుంటారో అదే తరహాలో ఇన్సూరెన్స్ పాలసీలను దాచుకో వాలి. అందుకు ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఖాతాను తెరవాలి. బీమా కంపెనీలు సైతం ఇక నుంచి ఎలక్ట్రానిక్ రూపంలోనే పాలసీలను జారీచేస్తాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఒక నోటిఫికేషన్‌లో తెలియపర్చింది. అయితే పాలసీహోల్డర్ల ప్రయోజనాల దృష్ట్యా భౌతిక రూపంలో పాలసీ డాక్యుమెంట్‌ను పొందే చాయస్‌ను తప్పనిసరిగా ప్రపోజల్ ఫారంలో పొందుపర్చాలని పేర్కొంది.
ఈక్షై ఇన్సూరెన్స్ అకౌంట్
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అంటే డిజిటల్ ఫార్మాట్‌లో బీమా పాలసీలను తీసుకోవడం. డిజిటల్‌గా ఉండే ఇన్సూరెన్స్ పాలసీని మీ ఈక్షై అకౌంట్ లేదా ‘ఈఐఏ’లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఖాతాల్ని నాలుగు ఇన్సూరెన్స్ రిపాజిటరీలు అందిస్తున్నాయి. అవి..ఎన్‌ఎస్‌డీఎల్ డాటాబేస్ మేనేజ్‌మెంట్ (ఎన్‌డీఎంఎల్), సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఆఫ్ ఇండియా, సీఏఎంఎస్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కార్వీలు. మీ జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా పాలసీలన్నింటినీ ఈక్షైఇన్సూరెన్స్ అకౌంట్ ద్వారానే నిర్వహించుకోవచ్చు.
ప్రయోజనాలేమిటి?
ఈఐఏతో పలు ప్రయోజనాలున్నాయి. ముందుగా మీ పాలసీ డాక్యుమెంట్ల రికార్డును మీ వద్ద ఉంచుకోనక్కర్లేదు. పేపర్ వర్క్ ఉండదు. క్లెయింలు చేసుకోవడం సులభం. అలాగే చాలామంది ఆన్‌లైన్ ద్వారా బీమా పాలసీలను కొంటుంటారు. వాటిలో ప్రతీ పాలసీకి వేరువేరుగా రికార్డులను అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌లోనైతే అన్నింటినీ అందులోనే పొందుపర్చుకోవచ్చు. మీ ఫోన్ నంబర్, ఈ చిరునామా వంటి వివరాలేవైనా అప్‌డేట్ చేయాలనుకుంటే ఈఐఏలో మార్పు చేస్తే సరిపోతుంది. ఆటోమాటిక్‌గా మీ బీమా కంపెనీలన్నీ ఆ మార్పును పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే మీ బీమా కంపెనీ మీకు ఏదైనా అప్‌డేట్ పంపితే అది ఈఐఏలో చూసుకోవచ్చు. అందుచేత మీ పాలసీని మేనేజ్ చేసుకోవడం మరింత సులవవుతుంది. పైగా ఇవి డిజిటల్ ఫార్మాట్‌లో ఉన్నందున, మీ పాలసీలను ఎక్కడో పెట్టి మర్చిపోయామన్న చింత అక్కర్లేదు. అవసరమైనపుడు మీ ఎలక్ట్రానిక్ అకౌంట్ తెరిచి, వాటిని చూసుకోవచ్చు.
ఖాతాను ప్రారంభించేదెలా?
ఈక్షైఇన్సూరెన్స్ ఖాతాను తెరవడం చాలా సులభం. మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో మీరు ఖాతా తెరవాలన్న చాయస్‌ను కంపెనీకి ఇస్తే, మీ తరపున బీమా కంపెనీయే ఖాతాను ఓపెన్ చేసిపెడుతుంది. అందుకు అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లను మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిపాజిటరీల నుంచి మీరు నేరుగా కూడా ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఖాతాను ఓపెన్ చేయడానికి ఎటువంటి చార్జీలను చెల్లించాల్సిన పనిలేదు. మీ బీమా కంపెనీ ఆ వ్యయాన్ని చెల్లిస్తుంది. కానీ మీ పాలసీలు అన్నింటికీ ఒకటే ఈఏఐ ఉండాలి. ఖాతాల విషయంలో రిపాజిటరీల మధ్య ఎటువంటి డూప్లికేషన్ జరగకుండా ఐఆర్‌డీఏఐ ఐట్రెక్స్ అనే ఇండస్ట్రీ సర్వీసును ఏర్పాటు చేసింది. పాలసీదారులు ఈ్రఇన్సూరెన్స్ ఖాతా తెరిచినంతనే వారి బీమా పాలసీలన్నింటినీ అందులో యాడ్ చేసుకోవచ్చు. మీ బీమా కంపెనీలను రిపాజిటరీ కాంటాక్టు చేసి, పాలసీలు డిజిటలైజ్ అయ్యేలా చూస్తుంది.






