మార్కెట్లో రిస్క్‌లు ఉన్నాయి..జాగ్రత్త
ఇన్వెస్టర్లకు నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొద్ది నెలల పాటు రికార్డు పరుగు తీసిన స్టాక్ మార్కెట్ సూచీ లు హఠాత్తుగా గతవారం పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో విచక్షణ లేకుండా కొనుగో ళ్లు జరపరాదని, పలు మార్కెట్ సంబంధిత రిస్క్‌లు ఉన్నందున ఆచితూచి ఎంపికచేసిన బ్లూచిప్స్‌ను మాత్రమే దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలంటూ ఇన్వెస్టర్లకు నిపుణులు సూచిస్తున్నారు. ఈ కీలకమైన రిస్క్‌ల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కార్పొరేట్ లాభాల వృద్ధి
క్యూ4 ఫలితాల సీజన్లో ప్రవేశిస్తున్న ఆయా కార్పొరేట్లు వెల్లడించిన లాభాల వృద్ధి ని నిశితంగా గమనించాలని, రాబడుల మందగమనం మార్కెట్‌కు రిస్క్‌గా పరిణమించే ప్రమాదం ఉందని ఏఎస్‌కే ప్రైవేట్ వెల్త్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సోమనాథ్ ముఖర్జీ తెలిపారు. గత రెండేండ్లుగా కార్పొరేట్ లాభాల వృద్ధి రేటు తగ్గుతున్నదని, తొలుత అది పెద్ద కంపెనీలకే పరిమితంకాగా, కొద్ది త్రైమాసికాల నుంచి చిన్న కంపెనీలకు సైతం వ్యాపిస్తున్నదని హెచ్చరించారు. పైగా షేర్ల విలువలు ఇప్పుడు చౌకగా లేవన్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు
తాజాగా తలెత్తిన ఇజ్రాయిల్ సంక్షోభంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయిల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు, ఎర్ర సముద్రంలో నౌకల పై జరుగుతున్న దాడులు తదితర భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే మార్కెట్ రిస్క్‌లో పడిపోతుందని మార్కెట్ నిపుణుడు కుశ్ గోదసార హెచ్చరించారు. ఉత్పత్తుల సరఫరాలకు అడ్డంకులు ఏర్పడి ద్రవ్యోల్బణాన్ని పెంచివేస్తుందన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రతరమైతే దీనితో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతాయని విశ్లేషించారు.
రుతు పవనాల మందగమనం
ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందంటూ స్కైమెట్ అంచనాల్ని వెల్లడించినప్పటికీ, రుతు పవనాలు మార్కెట్‌కు కీలకమైన రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించాలని సెబీ రిజిష్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్ గౌరవ్ గోయల్ చెప్పారు. ఎందుకంటే గతంలో వాతావరణ సంస్థల అంచనాలు పూర్తిగా వాస్తవరూపం దాల్చలేదని గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చాలావరకూ రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుందని, వర్షపాతం తగ్గితే ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని మోతీలాల్ ఓస్వాల్ ఒక నోట్‌లో హెచ్చరించింది. వర్షాభావ పరిస్థితులు వినియోగాన్ని తగ్గిస్తాయని, ఆర్బీఐ రేట్ల కోతను జాప్యం చేస్తుందన్నది.
యూఎస్ ఫెడ్ రేట్ల కోతలో జాప్యం
యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల్ని జాప్యం చేయడం భారత్‌తో పాటు ప్రపంచ ప్రధాన మార్కెట్లు అన్నింటినీ ఒడిదుడుకులకు లోను చేస్తాయని స్టాక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, రిటైల్ అమ్మకాలు వృద్ధిచెందడం, జాబ్‌లెస్ క్లెయింలు తగ్గడం వంటి గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును జాప్యం చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు. వాస్తవానికి జూన్ నెలతో ప్రారంభించి, ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీ రేట్ల కోత ఉంటుందంటూ ఇప్పటివరకూ కొనసాగిన అంచనాలకు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ తాజాగా బ్రేక్‌వేయడం మార్కెట్‌కు రిస్కేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.






