హే కృష్ణా!
కృష్ణా జలాల వాడకంలో తెలంగాణ వెనుకడుగు
ఏటా తగ్గుతున్న వినియోగం
- 2025 25.77 శాతానికే పరిమితం
- ఏపీ వినియోగించింది 74.27%
- 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పడిపోయిన తెలంగాణ వాడకం
- 34% తాత్కాలిక వాటా ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి
- మొత్తం వినియోగం పెరుగుతున్నా తగ్గుతున్న రాష్ట్ర వాటా
కృష్ణానది జలాల్లో ఒక్క చుక్క కూడా తెలంగాణ వాటాను వదులుకోం.. అనేది సర్కారు మాట. వాటా లెక్కలు పక్కన పెడితే.. ప్రస్తుతం రాష్ట్రానికి కేటాయించిన వాటా నీటిని కూడా వాడుకోలేక పోవడం విస్మయం కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకునే మొత్తం నీటిలో నాలుగోవంతు కూడా తెలంగాణ వాడుకోలేక పోవడం గమనార్హం. తాత్కాలికంగా తెలంగాణ వాటా 34శాతం కాగా.. ౨౬శాతానికే పరిమితం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కృష్ణా నదీజలాల (Krishna River Waters) వినియో గంలో తెలంగాణ (Telangana) వాటా క్రమంగా తగ్గిపోతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తు న్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం తాత్కాలిక నిష్పత్తి ప్రాతిపదికగా ఉన్నప్పటికీ.. వాస్తవ వినియోగంలో తెలంగాణ ఆ స్థాయిని కూడా అందుకోలేకపోతోంది. ముఖ్యంగా 2024 2025 సం వత్సరాల్లో కృష్ణా జలాల్లో తెలంగాణ వినియోగ వాటా వరుసగా 28.49 శాతం,
25.77 శాతానికి పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏపీ వాటా 71.51 శాతం నుంచి ఏకంగా 74.27 శాతానికి పెరిగింది. గణాంకాల ప్రకారం 2025 రెండు రాష్ట్రాలు కలిపి 1,038.98 టీఎంసీల నీటిని వినియోగించాయి. ఇందులో తెలంగాణ వాటా 267.73 టీఎంసీలు కాగా.. ఏపీ 771.25 టీఎంసీలు వినియోగించింది. అంటే మొత్తం వినియోగంలో తెలంగాణకు నాలుగో వంతుకు కొద్దిగా ఎక్కువ వాటా దక్కగా.. ఏపీ దాదాపు మూడొంతుల కంటే ఎక్కువ నీటిని వినియో గించిన పరిస్థితి కనిపిస్తోంది.
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు 34 శాతం తాత్కాలిక వాటా ప్రాతిపదికగా ఉంటే.. 2025 వాస్తవ వినియో గం మాత్రం 25.77 శాతానికే పరిమితమైంది. 34 శాతం వాటా స్థాయితో పోలి స్తే ఇది 8.23 శాతం తక్కువ కావడం గమనార్హం. 2025 మొత్తం 1,038.98 టీఎంసీలలో 34 శాతం లెక్కన తెలంగాణ వాటా సుమారు 353 టీఎంసీలకు పైగా ఉండాల్సి వస్తుంది. కానీ వాస్తవ వినియో గం 267.73 టీఎంసీల వద్దే నిలిచింది.
అంటే 34 శాతం స్థాయితో పోల్చితే సుమారు 85 టీఎంసీల మేర తక్కువ వినియోగం నమోదైనట్లు గణాంకాల ఆధారంగా లెక్క తేలుతోంది. ఇదే సమయంలో ఏపీ 771.25 టీఎంసీలను వినియోగించింది. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంలో వ్యత్యాసం మరింత పెరిగింది.
2024 ఇదే పరిస్థితి..
2024 గణాంకాలను పరిశీలించినా పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఆ ఏడాది మొత్తం 1,004 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగించగా.. తెలంగాణ 286 టీఎంసీలు మాత్రమే వినియోగించింది. ఇది మొత్తం వినియోగంలో 28.49 శాతంగా ఉంది. అదే ఏడాది ఏపీ 718 టీఎంసీలు వినియోగించి 71.51 శాతం వాటాను పొందింది. అంటే 2024 తెలంగాణ 30 శాతం కంటే దిగువకు పడిపోయింది. మరుసటి ఏడాది పరిస్థితి మరింత దిగజారి 25.77 శాతానికి చేరింది.
రెండేళ్లలో ఏపీ వినియోగం పెరిగగా.. తెలంగాణ వాటా మాత్రం తగ్గింది. 2019- నుంచి 2022 వరకు తెలంగాణ కృష్ణా జలాల వినియోగ వాటా దాదాపు 29-30 శాతం మధ్య కొనసాగింది. 2019- 29.88 శాతం, 2020 29.04 శాతం, 2021- 29.89 శాతం, 2022 30 శాతంగా నమోదైంది. కానీ 2024 28.49 శాతానికి, 2025 ఏకంగా 25.77 శాతానికి పడిపోయింది. అంటే 2022 పోలిస్తే కేవలం రెండేళ్లలోనే తెలంగాణ వాటా 4.23 శాతం వినియోగం తగ్గింది.
ఇదిలా ఉండగా 2025 తెలంగాణ వినియోగించిన 267.73 టీఎంసీలు గత 12 ఏళ్లలో అతి తక్కువ పరిమాణం కాదు. 2015 కేవలం 69.688 టీఎంసీలు, 2016 152.386 టీఎంసీలు, 2023- 120 టీఎంసీల వినియోగం నమోదైంది. కాబట్టి ప్రస్తుత గణాంకాల్లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య నీటి పరిమాణం మాత్రమే కాదు.. రెండు రాష్ట్రాల మొత్తం వినియోగంలో తెలంగాణ వాటా తగ్గిపోయింది.
వినియోగంలో విఫలమెందుకు?
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటాను ఎందుకు వినియోగించుకో లేకపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రానికి న్యాయమైన వాటా కావాలని డిమాండ్ చేస్తూ.. మరోవైపు అందుబాటులోకి వచ్చే నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతే భవిష్యత్‌లో నీటి లెక్కల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నీటి వినియోగం కేవలం నది నుంచి నీరు రావడంపైనే ఆధారపడదు.
ప్రాజెక్టుల సామర్థ్యం, రిజర్వాయర్ల నిర్వహణ, కాలువల నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు, విద్యుత్ లభ్యత, పంపింగ్ సామర్థ్యం, నీటిని సకాలంలో విడుదల చేయించుకోవడం వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందువల్ల తెలంగాణకు ఎంత నీరు దక్కాలి? అనే ప్రశ్నతో పాటు.. దక్కాల్సిన నీటిని ఎంత మేర వినియోగించుకోగలుగుతున్నాం? అనే ప్రశ్న కూడా అంతే కీలకంగా మారింది. 2025 ఏపీ వాటా 74.27 శాతంగా నమోదైంది.
2024 ఇది 71.51 శాతం కాగా... ఒక్క ఏడాదిలోనే ఏపీ వాటా 2.76 శాతం పెరిగింది. మరోవైపు తెలంగాణ వాటా 28.49 శాతం నుంచి 25.77 శాతానికి తగ్గింది. ఈ రెండు ధోరణులను కలిపి చూస్తే కృష్ణా జలాల వాస్తవ వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది.
2025- ఏపీ వినియోగం తెలంగాణ కంటే 503.52 టీఎంసీలు ఎక్కువ. అంటే తెలంగాణ వినియోగించిన 267.73 టీఎంసీలతో పోలిస్తే ఏపీ వినియోగం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. గత రెండేళ్లలో మొత్తం కృష్ణా జలాల వినియోగం 34.98 టీఎంసీలు పెరిగినప్పటికీ, ఆ పెరుగుదల తెలంగాణకు దక్కలేదు. తెలంగాణ వినియోగం 18.27 టీఎంసీలు తగ్గగా.. ఏపీ వినియోగం 53.25 టీఎంసీలు పెరిగింది.
అప్రమత్తం కావాల్సిందే..
కృష్ణా జలాల తుది వాటా విషయంలో ఇప్పటికే రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. భవిష్యత్ నీటి పంపిణీ, ప్రాజెక్టుల అవసరాలు, సాగు విస్తీర్ణం, తాగునీటి అవసరాలు, నదీ పరీవాహక ప్రాంతం వంటి అంశాలతో పాటు గత వినియోగ గణాంకాలు కూడా చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తెలంగాణకు ఇప్పుడు రెండు వైపులా సవాలు ఉంది.
ఒకవైపు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం బలమైన వాదనను వినిపించాలి. మరోవైపు రాష్ట్రానికి లభించే నీటిని సకాలంలో, పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలి. నీటిని వినియోగించుకోలేకపోవడం వల్ల భవిష్యత్‌లో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌పై ఆధారపడే దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఈ అంశం అత్యంత కీలకంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో 2025 గణాంకాలు తెలంగాణకు ఒక ముఖ్యమైన హెచ్చరికగా కనిపిస్తున్నాయి. మొత్తం కృష్ణా జలాల వినియోగం 1,038.98 టీఎంసీలకు పెరిగిన సమయంలో.. తెలంగాణ వినియోగం 267.73 టీఎంసీలకే పరిమితమైంది. ఫలితంగా రాష్ట్ర వాటా 25.77 శాతానికి పడిపోయింది. గతంలో 29-30 శాతం చుట్టూ ఉన్న తెలంగాణ వాటా ఇప్పుడు 26 శాతానికి దిగువకు రావడం సాధారణ పరిణామంగా తీసుకోవాల్సిన అంశం కాదు.
రాష్ట్ర భవిష్యత్ సాగునీటి అవసరాలు, ప్రాజెక్టుల లక్ష్యాలు, కృష్ణా జలాలపై హక్కుల నేపథ్యంలో ఇది వ్యూహాత్మకంగా పరిశీలించాల్సిన అంశంగా మారింది. కృష్ణా జలాలపై హక్కు కోసం పోరాటం ఒక వైపు.. దక్కే ప్రతి టీఎంసీని ఒడిసిపట్టుకోవడం మరో వైపు.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటేనే తెలంగాణ తన నీటి హక్కులను బలోపేతం చేసుకోగలదు.
