డిగ్రీ కాలేజీలకు సెలవులు పొడిగింపు
- ఎండల నేపథ్యంలో యూనివర్సిటీల నిర్ణయం
- జూన్ 8 నుంచి పునఃప్రారంభం
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులను వారం రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీలు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సం ఘం హర్షం వ్యక్తం చేసింది.
వాస్తవానికి డిగ్రీ కళాశాలకు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం 10 వారాలపాటు సెలవులు ఇవ్వాల్సి ఉండగా కేవలం మే నెల మొదటి తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మాత్రమే రాష్ట్రంలోని యూనివర్సిటీలు సెలవులు ప్రకటించాయని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కళాశాల విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్య వారోత్సవాలు, జనగణన విధులతోపాటు వేసవివేడి ఎక్కువగా ఉన్నందున సెలవులను పొడిగించాలని రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లకు, రిజిస్ట్రార్‌లకు విజ్ఞప్తి చేయడంతో ఒకవారం రోజులపాటు సెలవులు పొడిగించినట్లు, జూన్ 8 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. వర్సిటీ అధికారు లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జూనియర్ కాలేజీలకూ పొడిగించాలి
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కాలేజీల పునఃప్రారంభాన్ని వారం రోజులు వాయిదా వేయాలని గవర్నమెంట్ జూనియ ర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.పి.మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకు ని జూన్ 1 నుంచి కాకుండా జూన్ 8 నుంచి కాలేజీలు పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.






