టీచర్ల పోరుబాట
డిమాండ్ల సాధనకు సమర శంఖం
దశలవారీ ఉద్యమానికి కార్యాచరణ
స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
- ఆగస్టు 1న చలో హైదరాబాద్‌కు తపస్ పిలుపు
- 23న సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో బహిరంగ సభ
- సెప్టెంబర్ 1 ప్రభుత్వానికి టీటీజేఏసీ డెడ్‌లైన్
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం ఉపా ధ్యాయ లోకం సమర శంఖం పూరించబోతోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాం డ్ల సాధనకు రాష్ర్టంలోని ఉపాధ్యాయ సం ఘాలు ఐక్య పోరుకు సిద్ధమవుతున్నాయి. హామీల అమలు, హక్కుల సాధన లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దశలవారీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా, 23న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) లక్ష మందితో భారీ బహిరంగ సభను తలపెట్టబోతోంది. సెప్టెంబర్ 1లోపు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని తెలంగాణ టీచర్స్ జేఏసీ (టీటీజేఏసీ) ప్రకటించింది.
డిమాండ్లు ఇవీ..
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉపాధ్యా య సంఘాలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయనున్నాయి. పీఆర్సీ అమలు చేయాలని, ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, 317 జీవో సమస్య పరి ష్కారం, సీపీఎస్ రద్దు చేయాలని, బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని, సర్వీస్ రూల్స్‌ను అమలు చేసి విద్యావ్యవస్థను పటిష్టపరచాలని, 342 ఉత్తర్వులు అమలులోకి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీలకు పైచదువుల కోసం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్ అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వీటితో పాటు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని, ఈహెచ్‌ఎస్ కార్డులు జారీ చేసి అన్ని అస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు అందించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు సబ్జెక్టు వారీగా పేపర్లతో స్పెషల్ టెట్ నిర్వహించాలని, టెట్‌కు వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోడల్ స్కూల్స్ సొసైటీని విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా..
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు నుంచి దశల వారీ ఉద్యమానికి ఒక్కో సంఘం పిలుపునిచ్చింది. ఆగస్టు 1న తపస్ సంఘం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. వేలాది మందితో ఇందిరాపార్క్‌కు తరలిరావాలని జిల్లాల వ్యాప్తంగా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో తమ పర్యటనలను పూర్తి చేసుకున్న ఆ సంఘం నేతలు .. ఇందిరాపార్క్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ర్టం నలువైపుల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులను రాజధానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఆగస్టు 23న లక్ష మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు హైదరాబాద్ నగరం నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీపీఎస్‌ఈ ప్లాన్ చేస్తోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆర్థిక, ఆరోగ్య భద్రతను కల్పించేందుకు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఏకం చేసేందుకు జిల్లాల్లో బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర పూర్తయిన తర్వాత బహిరంగ సభను నిర్వహించనున్నది.
* తెలంగాణ టీచర్స్ జేఏసీ మరో భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 1లోపు పీఆర్సీ ప్రకటించాలని డెడ్‌లైన్ విధించింది. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
* ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఐక్య పోరాటం నిర్వహించాలని ఎస్‌పీసీ కార్యాచరణ రూపొందిస్తోంది.






