పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శాలువాలతో సన్మానం చేశారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, డిపిఓ, ఎంపీఓ మరియు సెక్రెటరీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. వారి కష్టంతోనే గ్రామం పరిశుభ్రంగా ఉండగలుగుతోందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కష్టపడి పని చేస్తూ గ్రామానికి, గ్రామపంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని కార్మికులను అభినందించారు.




