28 June, 2026 | 2:36 AM

కల్తీల కాలం

28-06-2026 01:27 AM

పానీపూరి నుంచి బడా హోటళ్లు, రెస్టారెంట్ల దాకా..

  1. డిమాండ్‌ను బట్టి పెరుగుతున్న కల్తీ
  2. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అర్జించాలనే అత్యాశ!
  3. విచ్చలవిడిగా ఫుడ్ కలరింగ్.. కస్టమర్ల చీటింగ్

* కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి.. కాదేది కల్తీకి అనర్హం అని రాష్ట్రంలోని పేరుమోసిన పలు హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త అర్థాన్ని చెబుతున్నాయి. ఆహార కల్తీ నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్యగా మారింది. కల్తీలను అరికట్టేందుకు అధికారుల వల్ల కూడా కావడంలేదు. చిన్నాచితక పానీపూరి బండి దగ్గర నుంచి హైదరాబాద్‌లోని బడా బడా హోటళ్లు, రెస్టారెంట్లు సైతం కల్తీ బాట పడుతున్నాయి.

ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా హోటళ్ల తీరు మారడంలేదు. నిబంధనలను పాతరేసి దర్జాగా కల్తీ దందాను కొనసాగిస్తున్నాయి. ఇన్‌స్టంట్ ఫుడ్‌కు డిమాండ్.. హోటళ్లు, రెస్టారెంట్ల మధ్య పోటీ పెరగడంతో నాణ్యత ప్రమాణాలు హుళక్కి అవుతున్నాయి.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అర్జించాలనే అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆహారాన్ని చూసీచూడగానే కస్టమర్లు వావ్ అనేలా కలరింగ్, కోటింగ్‌లతో కస్టమర్లను చీటింగ్ చేస్త్తున్నారు. ఫుడ్‌కు డిమాండ్ పెరగడంతో కల్తీ కూడా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇది పెద్దఎత్తున సాగుతోంది.

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): బయటి తిండికి, చిరుతిళ్లకు బాగా అలవాటు పడిన జనాన్ని కల్తీ పదార్థాలతో మోసగించడం కొన్ని హోటళ్లకు పరిపాటిగా మారింది. చిన్న పానీ పూరి బండి మొదలుకొని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ విచ్చలవిడిగా సాగుతోంది.

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో పానీపూరి తిన్న 31 మంది ఒకేసారి అస్వస్థతకు గురికావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరి విక్రేత ఇంట్లో తనిఖీ చేసి ఆ వ్యాపారిపై కేసు నమోదు చేశారు.

చార్మినార్ వద్ద ఉన్న ఓ పాస్ట్ ఫుడ్ గోదాముపై ఇటీవల హెచ్-ఫాస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టగా 90 లీటర్ల కల్తీ నూనె, 110 కిలోల ఫ్రైడ్ చికెన్ బయటపడింది. అలాగే నగరవ్యాప్తంగా 8 పనీర్ తయారీ కేంద్రాలు, 45 ఔట్‌లెట్స్‌లో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 825 కిలోల అనుమానాస్పద నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకో వడం గమనార్హం. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదకరం.

తక్కువ ధరకు లభించే చీజ్ అనలాగ్‌ను పనీర్ పేరుతో విక్రయిస్తున్నారు. చీజ్ అనలాగ్‌ను వెజిటేబుల్ ఆయిల్స్, స్టార్చ్, ప్రిజర్వేటివ్స్‌తో పాటు ఎమల్సిఫైయర్లతో తయారుచేస్తా రు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల్లో చీజ్ అనలాగ్ తయారీ కేంద్రాలు న్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండా హైదరాబాద్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. 3 నెలల క్రితం హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటకువచ్చాయి.

ఓ వ్యాపారి నుంచి ఏకంగా 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక లాభాల కోసం ఢిల్లీ, జమ్మూకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే అతను మాంసాన్ని సేకరించి, రోజుల తరబడి నిల్వ ఉంచి విక్రయించేవాడు. ఇలా కల్తీ ఆహారం కేసులు గురించి చెప్పుకుంటూపోతే అనేకం. వీటిని తిన్న ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు.

అపరిశుభ్రతకు కేరాఫ్‌లు..

పాడైన ఆహార పదార్థాలతోపాటు అపరిశుభ్రతకు కేరాఫ్‌లుగా హోటళ్లు, రెస్టారెంట్లు మారుతున్నాయి. ఇటీవల గోదావరిఖనిలోని సిమ్స్ వైద్య కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు పట్ట ణంలోని ఓ హోటల్‌లో విందు భోజనానికి వెళ్లి మండీ బిర్యానీ తిన్నారు.

12 మందిలో 11 మందికి వాంతులు, విరోచనాలు అవ్వడంతో వారిని ఆస్పత్రికి తర లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి అక్కడ.. ఇక్కడ అనే కాదు.. చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రతను పాటించడంలేదు.

నాణ్యమైన ఆహార పదార్థాలతో అందించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక హైద రాబాద్‌లోనైతే చెప్పనక్కర్లేదు. అధికారులు ఎప్పుడు తనిఖీచేసినా ఇలాంటి కేసులు బయటపడుతునే ఉంటాయి. హెచ్-ఫాస్ట్ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లో నగరంలో చేపట్టిన తనిఖీల్లో కొన్ని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రత పాటించడంలేదని తేలింది. కల్తీ ఆహార పదా ర్థాలతోపాటు కిచెన్‌లలో బొద్దింకలు, కుళ్లిపోయిన కూరగాయలు, బూజుపట్టిన ఆహా ర పదార్థాలు దర్శనమిచ్చాయి.

హైదరాబాద్ పీఎన్‌ఆర్ ఎంపైయిర్‌లోని ‘ది స్పైస్ కిచెన్’లో బొద్దింకలు, ధాన్యాలలో పురుగులు, పాత ఆహార పదార్థాలు కనిపిం చాయి. ఈ రెస్టారెంట్ 56 శాతం మాత్రమే పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ‘లా పినోజ్ పిజ్జా’లో బొద్దింకలు, గడువు ముగిసిన మసాలా మిశ్రమాలు, ఫేవర్డ్ సిరప్‌లు, బ్రెడ్ ఉత్పత్తులు, ఫ్రీజర్‌లో బల్లి విసర్జనలు, ఆహార పదార్థాలను సరిగా నిల్వచేయకపోవడం వంటివి కనిపించాయి.

ఈ రెస్టా రెంట్ 67 శాతం పరిశుభ్రతను పాటించింది. కోండాపూర్‌లోని ఒక ‘సబ్ వే’ అవుట్‌లెట్‌లో కుల్లి పో యిన లెట్యూస్, గడువుదాటి న కూర గాయలు, ఈగలు కనిపించా యి. 60 శా తం ఇది పరిశుభ్రతను పాటిం చింది. మదీనగూడలోని ‘అంతెరా రె స్టారెంట్’లో వాడకానికి పనికిరాని నూనె, సరైనా లేబు ల్ లేకుండా ఫుడ్ ఐటమ్స్, బూజు పట్టిన క్యాలీఫ్లవర్, బంగాళదుంపలను గుర్తించారు. అలాగే అదే ప్రాంతంలోని ‘బహార్ కేఫ్’ కేవలం 40 శాతం పరిశుభ్రతనే పాటిస్తున్నట్లు గా అధికారులు గుర్తించారు.

ఈ కేఫ్‌లో అత్యంత దారుణ పరిస్థితులు బయట పడ్డాయి. పక్కనే ఓపెన్ డ్రెయి న్లు, మురికిగా ఉన్న వంటగది, నీరు సరి గా లేకపోవడం, ఆహార వ్యర్థాలు కనిపించాయి. దీంతో కిచెన్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఎస్‌ఎంఆర్ వినయ్ టెక్నోపోలీస్ సమీపంలోని ‘10 పౌండర్ పిజ్జా తెరియ’ మాత్రం పరిశుభ్రత, రికార్డు నిర్వహణ, ఆహార భద్రతలో మంచి ప్రమాణాలు పాటించి 94 హైజీన్ స్కోర్‌ను సాధించింది.

కొన్ని రెస్టారెంట్లు, రిటైల్ షాపు లు చెల్లని ఎఫ్‌ఎస్‌ఏఐ లైసెన్సులను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి కఠినమైన శిక్షలు అవసరమని అధికారులంటున్నారు. ఈ కల్తీ ఆహా రం తీసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు, అలెర్జీ, ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అంటున్నారు. నిబంధనలు పాటించని వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆహార భద్రతా నిపుణులు భావిస్తున్నారు. 

కల్తీల బాగోతం.. 

* కల్తీ అల్లం వెల్లుల్లి, నూనె, పాలు, తేనె, టీపొడి, నెయ్యి, మసాలాలు, ఇలా ఆహార తయారీలో ఉపయోగించే దాదాపు అన్ని పదార్థాలు కల్తీకి గురవుతున్నాయి.

* ఇటీవల కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఆహార భద్రతా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి.

* రోజుకు వేలాది మందికి ఆహారం తయారుచేసే సమయంలో నిల్వ నిర్వహణ, నాణ్యత నియంత్రణలో పొరపాట్లు జరిగే అవకాశముంటుంది.

* నిబంధనలు ఉన్నప్పటికినీ వాటిని అమలుచేసే సిబ్బంది సరైన సంఖ్యలో లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

* హోటళ్లు, రెస్టారెంట్లు నేరుగా కల్తీ చేయకపోయినా ముడి సరుకులు సరఫరా చేసే వారి వద్ద నుంచే నాసిరకం లేదా కల్తీ పదార్థాలు వచ్చే అవకాశం ఉంది.

* లాభాల కోసం నాణ్యతలేని, కల్తీ పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు.

* పండుగలు, సెలవులు, రద్దీ సమయాల్లో నాణ్యత తనిఖీలను అధికారులు జరపకపోవడం వ్యాపారులు కల్తీ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

* ఒకవేళ అధికారులు దాడులుచేసినా కఠిన చర్యలు లేకపోవడంతో మళ్లీ మళ్లీ పాల్పడుతున్నారు.

* ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యతలేని ఆహార పదార్థాలు తెచ్చి విక్రయిస్తున్నారు.

* ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మేక, గొర్రె మాంసం, చేపలను తీసుకొచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు.

* ముఖ్యంగా కిచెన్‌లలో శుభ్రత పాటించకపోడం, స్వచ్ఛమైన నీరు వాడటంలేదు. నాణ్యమైన పదార్థాలు, తాజా కూరగాయలు వాడకపోవడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి.

హైజీన్ రేటింగ్స్‌ను కచ్చితంగా చూపించాలి.. 

నిబంధనలు ఉల్లంఘించిన వారికి శిక్ష విధించాలి. అమాయక కస్టమర్ల ప్రాణాలతో వీళ్లంతా ఆడుకుంటున్నారు. ప్రజలు క్వాలిటీ ఫుడ్ కోసం ఎంతో డబ్బులు ఖర్చుపెడుతూ వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఆయా రెస్టారెంట్లు, హోటళ్ల హైజీన్ రేటింగ్స్‌ను కూడా తప్పనిసరిగా చూపించాలి. అప్పుడు కస్టమర్లు వారికి నచ్చిన రెస్టారెంట్లలో కొనుగోలు చేస్తారు. పదే పదే తప్పులు చేసే హోటళ్లను కఠిన శిక్షించాలి. 

 శ్రీకాంత్, హైదరాబాద్ వాసి