22 August, 2026 | 1:24 PM

రాయదుర్గం పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

22-08-2026 12:45 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు

శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (విజయక్రాంతి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి అంజయ్యనగర్ వైపు ప్రయాణిస్తున్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ 2వ గేటు సమీపానికి చేరుకుని కేర్ హాస్పిటల్ మెయిన్ రోడ్డు వైపు మలుపు తిరుగుతున్న సమయంలో రైడర్ అదుపు తప్పి బైక్ స్కిడ్ అయింది. అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి కిందపడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుడిని అబ్బాస్ సిద్దీక్ (25)గా గుర్తించారు. మరో ఇద్దరు రైడర్ సహస్ర చట్టోపాధ్యాయ (25), మిడిల్ పిల్లియన్ అభిషేక్ సింగ్ (25) తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ వెంటనే కేర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన బైక్ పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న హై-ఎండ్ మోటార్‌సైకిల్‌గా తెలుస్తోంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అతివేగంగా వెళ్తుండడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.