25-05-2025 12:00:00 AM
మహిళల్ని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు.. ఇలా ఒక్కటేమిటి థైరాయిడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలు అనేకం. ఈ క్రమంలో థైరాయిడ్ ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి అంశాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
కొన్ని శారీరక లక్షణాల ద్వారా థైరాయిడ్‌ను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేకపోవడం.. వంటివి కనిపిస్తే దానిని ‘హైపో థైరాయిడిజం’ గా భావించాలి.
సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం, నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం.. వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని హైపర్ థైరాయిడిజంగా పరిగణించాలం టున్నారు నిపుణులు.
థైరాయిడ్ రావడానికి శరీరంలోని హార్మోన్ స్థాయిల్లో తేడాలే కారణమంటున్నారు నిపుణులు. టీ3, టీ4, టీఎస్‌హెచ్ అనే హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల థైరాయిడ్ గ్రంథి వేగంగా లేక నెమ్మదిగా పని చేస్తుంది. హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి వేగంగా పనిచేస్తుంది. హైపో థైరాయిడిజంలో అవయవాలు నెమ్మదిగా పనిచేయడం వల్ల క్యాలరీలు అంత త్వరగా కరగవు. అందుకే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
ఏం చేయాలి?
థైరాయిడ్ ఉన్నవాళ్లు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, సోయా, చిక్కుళ్లు.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయొడిన్, జింక్, ఇనుము, కాపర్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు.. ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఆకుకూరలు, చేపలు, పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. రోజుకు 150 మి.గ్రా. ల అయొడిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు.. సుమారు 200 మి.గ్రా.లు తీసుకోవడం మంచిది.