23 May, 2026 | 1:55 PM

ఇంటికో వంద.. బడికి చందా!

18-06-2024 04:34 AM
  • సంకల్పసిద్ధితో మజీద్‌పూర్ సర్కార్ బడికి మహర్దశ

తొలి ప్రయత్నంలోనే రూ.5.30 లక్షల విరాళాలు

రూ.25లక్షలు పాఠశాల పేరుతో బ్యాంక్‌లో జమ

ఆదర్శంగా నిలుస్తున్న అబ్దుల్లాపూర్‌మెట్ మండలవాసులు

బడి ఊరికి ఆత్మవంటిది. బడి మూతపడిన గ్రామాలు ఆత్మలేని శరీరాల్లా ఉంటాయి. ప్రభుత్వ బడులే సామాజిక దేవాలయాలు. ఇవి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాయి. అర్హత, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ప్రమాణాలున్న పాఠశాలలోనే నేటి పిల్లలు ప్రయోజకులుగా ఎదుగుతారు. ఇవి కేవలం మన ప్రభుత్వ పాఠశాలలేనన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలి.

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 17: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుం డా  ప్రభుత్వ బడి అభివృద్ధికి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ గ్రామస్థులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి ‘ఇంటికి వంద.. బడికి చం దా’ పేరుతో గ్రామస్తులు ఐక్యంగా ముందు కు కదిలారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సొంతగా నిధులు సమకూర్చుకుని ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. కార్పోరేట్ ను తలదన్నేలా మార్చి, ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ప్రతి గ్రామంలో ప్రతిఒక్కరూ ఆలోచన చేస్తే అందరికీ ఉచిత విద్య మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.

భిన్నమైన ఆలోచన

సమాజ దేవాలయం ప్రభుత్వ పాఠశాలేనంటూ మజీద్‌పూర్ జడ్పీహెచ్‌ఎస్ ప్రధా నోపాధ్యాయుడు విజయభాస్కర్‌రెడ్డి విభిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఇంటి  వంద బడికి చందా’ నిర్ణయాన్ని గ్రామసభ ముందు పెట్టారు.  మన పాఠశాలను మన మే అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకతను తెలియజేసి, గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా ముందుకు రావాలని విజయభాస్కర్ రెడ్డి కోరారు. మాజీ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. 

అపూర్వ స్పందన..

గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమవంతుగా విరాళాలు అందజేశారు. మొదటగా మాజీ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్‌రెడ్డి రూ.50వేలు ఇవ్వడంతో ప్రజలు ముందుకు కదిలారు.  హన్మంత్‌రెడ్డి రూ. 1.16 లక్షలు, శ్రీజ డెవలపర్స్ అధినేత శ్రీశైలంగౌడ్ రూ.55వేలు ఇచ్చారు. వృద్ధులు పింఛన్ నుంచి విరాళాలు ఇచ్చి, పాఠశాల అభివృద్ధికి తమవంతు చేయూతనిచ్చారు.  మొదటి రోజే ప్రజల నుంచి రూ.5.30 లక్షలు విరాళాలు వచ్చాయి.  పాఠశాలను కార్పోరేటు స్థాయిలో  తీర్చిదిద్దుకున్నారు. విద్యార్థుల అభున్నతి కోసం రూ.25లక్షలు పాఠశాల పేరిట బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.

 తల్లిదండ్రుల విశేష పాత్ర

మజీద్‌పూర్ గ్రామస్తులు 15 మందితో బృందాలుగా ఏర్పడి, ప్రతిరోజు పాఠశాలను సందర్శిస్తారు. ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యులతో మాట్లాడి పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తారు.  

సర్కార్ బడి ప్రత్యేకతలు

విశాలమైన స్థలంలో రెండస్తులతో కూడిన భవనం. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, మొక్కల పెంపకంతో ఆహ్లాదకరమైన వాతావరణం, అనుభవం, అర్హత, అంకితభావం ఉన్న ఉపాధ్యాయుల బోధన. ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో శిక్షణకు ఇద్దరు ప్రత్యేక టీచర్లు.  ప్రాథమిక పాఠశాలలో సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు. ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ ఎంపిక కోసం ప్రత్యేక శిక్షణ, సీఎస్‌ఆర్ నిధులతో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డు, కంప్యూటర్ విద్య,  విద్యార్థులకు వారంలో మూడు రకాల యూనిఫామ్స్, జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడాపోటీల్లో మజీద్‌పూర్ విద్యార్థుల ఎంపిక.

గత విద్యా సంవత్సరంలో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో 7వ తరగతి విద్యార్థి శంకర్ పవన్ రెండో బహుమతి అందుకున్నాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆటో సౌకర్యం, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ్ద. ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటుతో స్వచ్ఛమైన తాగునీరు, యూడబ్ల్యూహెచ్ సంస్థ ద్వారా కెమిస్త్రీ, ఫిజిక్స్, బయాలజీ ల్యాబ్ ఏర్పాటు. విద్యార్థుల విద్యాబోధనకు కావాల్సిన అన్ని రకాల కనీస, మౌలికమైన సదుపాయాలు మజీద్‌పూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి.