16 April, 2026 | 2:01 AM

బడ్జెట్‌లో బీసీల వాటా!

28-02-2026 12:00 AM

దక్కేంత వరకు పోరాటం చేస్తాం

బీసీ సంఘాల నేతల హెచ్చరిక

బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష 

తరలివచ్చిన వందలాది మంది నాయకులు

ముషీరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): త్వరలో చేపట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు ప్రత్యేక వాటా కేటాయించాలని, రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగేంత వర కు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే అన్ని రంగాల్లో ముందుకెళ్తారనరి వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేస్తున్నదని, ఈ విషయాలపై బీసీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

బీసీలకు బడ్జెట్ కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై నిరసిస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాల గోని బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. పలుపార్టీల నేతలు, సంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు. 

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల

ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీసీల పోరాటాలు ఒక పార్టీని గద్దెదించి మరొక పార్టీని అధికారంలోకి తేవడానికి ఉపయోగపడుతున్నాయే తప్పా రాజ్యాధికారం దిశగా ముందుకు సాగడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా మా కులాలను ఎస్సీ జాబితాలో, బీసీ జాబితాలో చేర్చాలని అంటూ ధర్నాలు చేయడం బాధాకరమన్నారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి అమలు కావడం లేదన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

9 శాతం ఉన్న అగ్రవర్ణాలు చట్ట సభల్లో ఉంటే 90శాతం ఉన్న దళిత బహుజనులు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నాలకే పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి ప్రక్షాళణ, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను తొలగించే ఉద్దేశంతో ప్రారం భించిన హైడ్రా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను కూడాగొట్టడానికి ఉపయోగించడం సరికాదన్నారు. ఇప్పటికైనా బీసీలు వినతిపత్రాలు ఇచ్చే పనులు మానుకొని ఐక్యంగా రాజ్యాధికారం దిశగా పయనించాలని సూచించారు. 

ఓటర్లుగానే బీసీలు

శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలను పాలకులు ఓటర్లుగానే చూస్తున్నారు తప్పా వాటాదారులుగా గుర్తించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు నిధులు, విధి విధానాలు లేకపోవడంతో దివాలా తీశాయన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బీసీలకు నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల కోసం జరిగే పోరాటంలో బీఆర్‌ఎస్ పార్టీ బీసీ నాయకులతో కలిసి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు, మాజీ డీజీపీ పూర్ణచం దర్‌రావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా టీసీలు ఉద్యమించి తమ న్యాయమైన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లను బీసీలకే కేఆయించాలని, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన 21 హామీలను వెంటనే అమలు చేయాలని, గత బడ్జెట్‌లో బీసీలకు కేటాయించిన నిధుల పట్ల శ్వేత పత్రాన్ని విడు దల చేయాలని వారు డిమాండ్ చేశారు. కుమ్మెర గ్రామంలో బీసీలపై జరిగిన అమానవీయ సంఘటనలో నిందితులను కఠినం గా శిక్షించాలని కోరారు.

కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ పొలిటికల్ ప్రంట్ రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ గౌడ్, మేదావుల పోరం నేతలు ఎర్ర మదు, వెంక న్న, బైరి శేఖర్, అంబాలనారాయణగౌడ్, దాసోజు లలిత, లింగం యాదవ్, పొన్నం దేవరాజు, కీర్తిలాల్ పాల్గొన్నారు.