16 April, 2026 | 3:33 AM

పునరావాస ప్యాకేజీ అసెంబ్లీలో ప్రకటిస్తా

28-02-2026 12:00 AM
  1. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి రివార్డు వెంటనే అందేలా చర్యలు 
  2. చట్టపరిధిలో ఏపని చేసుకున్నా ప్రభుత్వానికి అభ్యంతరం ఉండదు 
  3. ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది
  4. మాజీ మావోయిస్టులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  
  5. మావోయిస్టు అగ్రనాయకుల ఆరోగ్యంపై సీఎం ఆరా 
  6. జైల్లో ఉన్న మావోయిస్టులను కలిసేందుకు అనుమతి ఇవ్వండి 
  7. సీఎంను కోరిన మాజీ మావోయిస్టులు 
  8. భవిష్యత్ ప్రణాళికను సీఎంకు వివరించిన నేతలు  

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పునరావా స ప్యాకేజీ అంశం అసెంబ్లీలో ప్రకటిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మావోయిస్టు పార్టీ మాజీ కీలక నేతలు  శుక్రవారం  సచివాయంలో భేటీ అయ్యారు.  ఈ భేటీలో మావోయి స్టు అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్‌తో పాటు చంద్రన్న పాల్గొన్నారు. దా దాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మావోయిస్టులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి  ఆరోగ్యం, యోగ క్షేమాలను తెలుసుకున్నారు. మావోయిస్టుల అగ్రనాయకుల ఆరోగ్యం పైనా ఆరా తీశారు. ఆయుధం వీడి జన జీవన స్రవంతిలో కలిసిన వారిపై ఉన్న రివార్డును వెంటనే అం దేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. చట్ట ప్రకారం పునరావాసం, రక్షణపరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు..

తాము లొంగిపోవడానికి చొరవ చూపిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మావోయిస్టులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరు, లొంగుబాటు పాలసీ బాగుందని దేవ్‌జీ అన్నారు. అంతే కాకుండా భవిష్యత్ ప్రణాళికపై సీఎంకు మావోయిస్టు అగ్రనేతలు వివరించారు.  జైల్లో ఉన్న మావోయిస్టులను కలిసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మాజీ మావోయిస్టులు సీఎంను కోరారు. ఈ విషయంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్లుగా తెలిసింది. 

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఎవరైనా స్వేచ్ఛగా తమ వృత్తులను ఎంచుకోవచ్చని తెలిపారు. మాజీ మావోయిస్టులు ఇతర ఏ పని చేసుకున్నా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. అయితే చట్టం అందరికీ సమానమేనని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఈ కీలక భేటీలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్‌కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు.

తుపాకీ సిద్ధాంతం నడవదు 

త్వరలోనే ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం 

మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ 

ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదనే విషయం త్వరలోనే ప్రజలకు వివరిస్తామని మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలిపారు.  సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం అనంతర ం దేవ్ జీ మీడియాతో మాట్లాడారు. లొంగుబాటుకు గల కారణాలను తామందరం కలిసి ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాస్తామని తెలిపారు.

జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ఇచ్చే రివార్డు పాలసీని రూ. కోటికి పెంచాలని, ఐ దు ఎకరాల భూమి ఇవ్వాలని  సీఎం రేవంత్‌రెడ్డిని కోరామ న్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారన్నారు. ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై సీఎం హామీ ఇచ్చారని దేవ్‌జీ తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే జైల్లోలో ఉన్న మావోయిస్టులను కలుస్తామని చెప్పారు. 

సచివాయలంలో సాదర స్వాగతం 

గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం లభించడం హాట్ టాఫిక్‌గా మారింది. గత ప్రభుత్వాల హయాంలో మాజీ మావోయిస్టులకు సచివాలయం ప్రవేశంపై ఆంక్షలు ఉండగా, రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెటి చర్చలకు ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశమైంది. వీరంతా సీఎంతో రాజకీయ ఎజెం డాపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావడం, జనజీవన స్రవంతిలో కలిసిన వారి భవిష్యత్తుపై ఈ చర్చలు సాగాయి.  ఒక వైపు రాజకీయ ఎజెండాను చర్చిస్తూనే.. మ రో వైపు శాంతిభద్రతల అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసు కున్నట్లుగా కనిపిస్తోంది. మాజీ మావోయిస్టుల అనుభవాన్ని సామాజిక మార్పు కోసం ఏ విధంగా వాడుకో వాలనే కోణంలో సమాలోచనలు జరిగినట్లు సమాచారం. ఇప్పటీ వరకు ఆయుధాలు పట్టిన నేతలు.. ఇప్పుడు ప్రభుత్వం ముందు తమ ప్రతిపాదనలు ఉంచారు.