బీజేపీ వస్తే హైదరాబాద్ యూటీ

06-05-2024 02:13:16 AM

జూన్ 2 తర్వాత మార్చేందుకు కుట్రలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం 

ఉప్పల్, ఎల్బీనగర్, రాంనగర్‌లో రోడ్ షో

హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్/ఎల్బీనగర్, మే 5 (విజయక్రాంతి): కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మార్చేందుకు కుట్ర పన్నుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రాత్రి ముషీరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తా లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రను అడ్డుకోవాలంటే బీఆర్‌ఎస్ ఎంపీలు 10 నుంచి 12 మంది పార్లమెంట్‌లో ఉండాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజ లు బీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతునిచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు అంటే ఒక్కస్థానంలో విజయం సాధించలేదన్నారు. కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్‌ఎస్ తరపున ఖైరతాబాద్‌లో గెలిచిన దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని, ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఎద్దేవాచేశౠరు.  బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గోషామహల్‌కే పరిమితమైందని చెప్పారు. ఐదు ఎంపీ స్థానాల తోనే ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌కే సాధ్యమైందనే విషయం గుర్తు చేశారు. ౫ స్టీలతోనే 35 పార్టీలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి నాలుగున్నర నెలలు అయినా ఇచ్చిన గ్యారంటీలను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీసైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు పోవడం షురూ అయిందన్నారు. దీంతో లాంతర్లు రివర్స్ వస్తున్నాయని తెలిపారు. ఈ సభలో సైతం కరెంట్ ఎప్పుడు పోతుందో అనే భయంతో లాంతర్ల మహిళలు వచ్చారంటే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ఐదేండ్ల కింద ట సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన ప్రస్తుత ఎంపీ కిషన్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ఏమి చేయలేదన్నారు. నాంపల్లి లో సింటెక్స్ ట్యాంక్‌ను ప్రారంభించారని, సీతాఫల్‌మండిలో సైతం ఒక లిఫ్ట్‌ను ప్రారంభించారని గుర్తుచేశారు.

హైదరాబాద్‌కు వరదలొస్తే  ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. గుజరాత్ లో వరదలు వస్తే రూ.వెయ్యి కోట్లు ప్రకటిం చే మోదీ.. రాజధర్మం పాటిస్తున్నాడా అని ప్రశ్నించారు. పదేండ్ల కాలంలో 30 లక్షల కోట్లను లూటీ చేశారని.. దోచిన డబ్బును అంబానీ, ఆదానీల ఆస్తులు పెంచడానికి దోహదం చేశారని తెలిపారు. సికింద్రాబాద్‌లో ప్రజల మనిషిగా పేరున్న పజ్జన్న ఢిల్లీ నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు.  

హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి

తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి కర్మన్‌ఘాట్ నుంచి సరూర్‌నగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుధీర్‌రెడ్డిని గెలిపించిన విధంగానే ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి, గెలిచిన 420 నాయకులు ఇప్పుడు హామీలు అమలు చేయమంటే చేతులు ఎత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని చౌకీదార్ చోర్‌హై అని విమర్శిస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బడే భాయ్ అని అంటున్నాడని.. బీజేపీతో రేవంత్‌రెడ్డి మిలాఖత్ అయ్యాడనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. రాహుల్‌గాంధీ లిక్కర్ స్కామ్ లేదంటే.. రేవంత్ మాత్రం కవితను అరెస్టు చేయడం కరెక్ట్ అంటారు.. ఒకేపార్టీ నాయకులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దారని, హైదరాబాద్ అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌ను గెలపించారని.. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

మల్కాజిగిరిలో రాగిడిదే విజయం

మల్కాజ్‌గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిదే విజయమని కేటీఆర్ స్పష్టంచేశారు. ఆదివారం ఉప్పల్‌లో రాగిడి తరఫున నిర్వ హించిన రోడ్ షోకు కేటీఆర్ హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కష్టాలు తెచ్చిందని అన్నారు. పదేండ్ల కాలంలో కేంద్రం హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం ఉప్పల్, అంబర్‌పేటలో నిర్మిస్తున్న ఫ్లుఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని, దేవుడిని అడ్డం పెట్టుకుని ఓట్లను అడుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారనిచెప్పారు.

అహంకా రంతో విర్రవీగుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చా రు. ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటకుండానే వద్దురో కాంగ్రెస్ పార్టీ పాలన అంటూ ప్రజలు మొత్తుకుంటున్నారని చెప్పారు. అసలైన మార్పంటే ఏమిటో చూడాలంటే కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. 2014లో బడే బాయ్ మోడీ మోసం చేశారని, 2023లో చోటే భాయ్ మోసం చేశారన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం చేతకాక తిట్లు తిట్టడం, దేవుడు మీద ఒట్లు వేయడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.