కాంగ్రెస్‌కు ఓటేస్తే.. దొంగలకు సద్దికట్టినట్టే!

06-05-2024 02:11:12 AM

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం

కేసీఆర్‌ను తిట్టుడు.. దేవుడిపై ఒట్టు పెట్టుడు సీఎం పని

ఎమ్మెల్యే హరీశ్‌రావు

రాజన్న సిరిసిల్ల/మెదక్, మే 5 (విజయక్రాంతి): ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే దొం గలకు సద్దికట్టినట్టేనని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ఆదివారం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మోసపోయారని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటలు కరెంట్ ఉండేదని, కాంగ్రెస్ వచ్చాక కరెంట్ కోతలతో మోటర్లు కాలుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో  కేసీఆర్ కిట్లు బంద్ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని ఎద్దేవాచేశారు.

దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ దేవుళ్ల మీద ఒట్లు వేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, 150 రోజులు దాటినా అమలు చేయలేక చేతులెత్తేశారని నిప్పులు చెరిగారు. నాడు డిసెంబర్ 9న రుణమాఫీ చెస్తామని, ఇప్పుడు ఆగస్టు 15న చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు 11 సార్లు రూ.72 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడిగితే ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీయాలన్నారు. కేసీఆర్‌ను తిట్టుడు, దేవుడిపై ఓట్టు పెట్టుడే సీఎం పనిగా మారిందని దుయ్యబట్టారు. ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీడీ కార్మికులకు బీజేపీ ప్రభుత్వం పీఎఫ్ రాకుండా చేసిందని ఆరోపించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమన్నది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా?

దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా అని హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం రామాయంపేటలో బీఆర్‌ఎస్ మెదక్ లోక్‌సభ అభ్యర్థికి మద్దతుగా కార్నర్ మీటింగ్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాపై వివక్ష చూపిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచినందుకు బీజేపీకి ఓటేయాలా అని ప్రశ్నించారు.