కోకాపేటలో హైడ్రా మెరుపు దాడులు
గోల్ ఫిష్ కాంపౌండ్ వాల్ కూల్చివేత
94 ఎకరాల చెరువు.. కబ్జాలతో మిగిలింది 22 ఎకరాలే
రాజేంద్రనగర్, మే 26 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ గండిపేట మండలం కోకాపేటలోని కొత్తచెరువులో మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, ఇరిగేషన్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చెరువు ఎఫ్టీఎల్‌లో గోల్ ఫిష్ కన్‌స్ట్రక్షన్ చేపట్టిన కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు.
గతంలో కొత్తచెరువు ఎఫ్టీఎల్ బఫర్‌జోన్ కలిపి 94 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. తరచుగా బడాబాబులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు చెరువును కబ్జా చేసి పెద్దపెద్ద అపార్ట్ మెంట్లు, టవర్లు నిర్మించారు. ప్రస్తుతం చెరువు కేవలం 22 ఎకరాలు మాత్రమే మిగిలింది. గతంలో సమీప గ్రామాల్లోని మత్స్యకారులు ఈ చెరువులో చేపలు పట్టుకొని జీవనం కొనసాగించేవారు.
ప్రస్తుతం చెరువు ఎప్టీఎల్ బఫర్ జోన్ కబ్జాలు అవడంతో చెరువు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోవడంతో చెరువు ఉనికినీ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. హైడ్రాకు ఈ అంశంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఉదయమే జేసీబీలు హిటాచీలతో రంగంలోకి దిగిన హైడ్రాధికారులు కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను అనంతరం చెరువు రక్షణలో భాగంగా కంచెను ఏర్పాటు చేశారు.
-ఒక్కరోజు 34 ఎకరాలు, 4 వేలకోట్ల భూమికి రక్షణ..
కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఒకరోజులో రెండు చెరువులను కాపాడింది. మాదాపూర్‌లోని ఈదులకుంట (6.05 ఎకరాలు), కోకాపేటలోని కొత్త చెరువు (22 ఎకరాల) ఆక్రమణలను తొలగించింది. భూముల మార్కెట్ విలువ సుమారు 4వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈదులకుంటను కబ్జాదారులు మాయంచేసే చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా రంగంలోకి దిగి పూర్తి పరిశీలన చేపట్టింది. సాంకేతిక, రికార్డుల పరంగా పక్కా ఆధారాలను సేకరించి చెరువులకు విముక్తి కల్పించింది.






