27 May, 2026 | 12:58 AM

ప్రభుత్వ భూముల్లోనే నీటి మాఫియా

27-05-2026 12:00 AM

మియాపూర్ సర్వే నం.100, 101లో యథేచ్ఛగా అక్రమబోర్లు 

రోజుకు 30 ట్యాంకర్లతో భూగర్భ జలాల దోపిడీ

శేరిలింగంపల్లి, మే 26 (విజయక్రాంతి): హైదరాబాద్ శివారులో నీటి కొరతను ఆసరాగా చేసుకుని నీటి మాఫియా రెచ్చి పోతోంది. మియాపూర్ సర్వే నంబర్ 100తో పాటు, దీప్తి శ్రీనగర్‌కు ఆనుకుని ఉన్న సర్వే నం.101లోనూ ప్రభుత్వ ఆధీనంలోని హెచ్‌ఎండీఏ భూముల్లోనే అనుమతులు లేకుండా యథేచ్ఛగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

వివాదాస్పద భూముల్లోనూ తవ్వకాలు..?

గొట్టిపాటి సత్యవాణి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న భూములతో పాటు, ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదంలో ఉన్న స్థలాల్లోనూ పెద్దఎత్తున బోర్లు వేశారని స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అక్రమంగా తవ్వినందుకు కొందరికి ‘నజరానా’ రూపంలో సొమ్ము చెల్లిస్తూ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

రోజుకు లక్షల్లో దందా..

ఒక్కో అక్రమ బోరు నుంచి రోజుకు 10 నుంచి 30 ట్యాంకర్ల వరకు నీటిని తోడి అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, హోటళ్లు, ఐటీ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తూ మాఫియా రోజూ లక్షలు గడిస్తోందని సమాచారం. దీంతో మియాపూర్, చందానగర్, గోపనపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో గృహ అవసరాల బోర్లు పూర్తిగా ఎండిపోయాయి.

వాల్టా చట్టం బేఖాతర్..

గ్రౌండ్ వాటర్ శాఖ అనుమతి లేకుండా, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ భూములు, చెరువు పరిసరాల్లోనూ బోరింగ్‌లు వేస్తున్నారు. ఇటీవల మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఇలాంటి కేసులు నమోదయ్యాయి. కొన్నిచోట్ల కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారనే ఫిర్యాదులూ ఉన్నాయి.  

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం..

హెచ్‌ఎండీఏ భూముల్లోనే తవ్వకాలు సాగుతున్నా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్బీ, గ్రౌండ్‌వాటర్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం మాఫియాకు కలిసివస్తోందని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ అండదండలతోనే దందా సాగుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

స్థానికుల డిమాండ్..

అక్రమ బోర్లన్నీ వెంటనే సీల్ చేసి, ట్యాంకర్లకు ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్‌ను తప్పనిసరి చేయకపోతే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హైడ్రా సహా సంబంధిత శాఖలు నీటి మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.